ఈసారి ఐపీఎల్ ముంగిట భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరి కొన్ని రోజుల్లో లీగ్ మొదలవుతుండగా.. ఉన్నట్లుండి యూఏఈ నుంచి ఇంటిముఖం పట్టాడతను. చెన్నై సూపర్ కింగ్స్ కీకల ఆటగాళ్లలో ఒకడైన అతను.. ఇలా ఉన్నట్లుండి టోర్నీకి దూరం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అతడి నిష్క్రమణకు రకరకాల కారణాలు వినిపించాయి. కొందరేమో కరోనాకు భయపడి రైనా వచ్చేశాడన్నారు. ఇంకొందరేమో తన మేనత్త ఇంట్లో దోపిడీ దొంగలు సృష్టించిన భీభత్సం తాలూకు విషాదం వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడన్నారు. అలాగే చెన్నై యాజమాన్యం తీరు నచ్చక, తనకు దుబాయ్‌లో సరైన గౌరవం దక్కలేదని రైనా అలిగి ఇంటికొచ్చేశాడన్నారు.
ఇందులో ఏది నిజమో తెలియదు. ఐతే తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత చెన్నై జట్టు బాగా ఇబ్బంది పడ్డ నేపథ్యంలో సురేష్ రైనా మళ్లీ జట్టుతో కలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం చెన్నై అభిమానుల్లో కలిగింది. ఇంతకుముందు ఏం జరిగిందో ఏమో.. రైనా తిరిగి లీగ్‌కు వస్తాడా అని చెన్నై జట్టు సీఈవో విశ్వనాథన్‌ను మీడియా వాళ్లు అడిగితే అందుకు ఛాన్సే లేదన్నాడు.
రైనా గురించి తాము అస్సలు ఆలోచించట్లేదన్నాడు. ఇంటికైతే వచ్చేశాడు కానీ.. రైనా ట్వీట్లు అవీ చూస్తే అతడి మనసంతా చెన్నై జట్టుతోనే ఉందేమో అనిపించింది. కానీ అటువైపు చెన్నై జట్టు యాజమాన్యం నుంచి మాత్రం అలాంటి స్పందన కరవైంది. పైగా జట్టు వెబ్ సైట్ నుంచి రైనాతో పాటు వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్న హర్భజన్ పేరును కూడా తొలగించారు.
టోర్నీ నుంచి ఏదైనా కారణాలతో తప్పుకున్న ఆటగాళ్ల పేర్లను జట్ల వెబ్ సైట్లలో విత్‌డ్రాన్ ప్లేయర్లుగా పేర్కొంటుంటారు. ఇలా పూర్తిగా తొలగించేయరు. దీంతో ఈ పరిణామం సందేహాలకు తావిచ్చింది. తాజా సమాచారం ప్రకారం రైనా, హర్భజన్లతో చెన్నై జట్టు శాశ్వతంగా బంధం తెంచుకుంటోందని.. వారితో ఒప్పందాలను రద్దు చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టిందని.. వీళ్లిద్దరూ 2021 ఐపీఎల్‌లోనూ ఆ జట్టుకు ఆడరని అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం చెన్నై జట్టులో రైనాను అంతర్భాగంగా భావించే అభిమానులు తీవ్ర నిరాశకు గురి కావడం ఖాయం.