కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), భారతీయ రైల్వే, బ్యాంకులు వంటి సంస్థలు వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం ఈ కొత్త మార్పులను తీసుకొచ్చాయి.
ట్రాయ్ నిబంధనలు: టెలికం కంపెనీలు సందేశాల ట్రేసబిలిటీని పెంచడం ద్వారా అనవసర సందేశాలు, మోసాల నివారణకు చర్యలు తీసుకోనున్నాయి. దీనితో ప్రతి సందేశాన్ని పర్యవేక్షించి, వినియోగదారుల భద్రతను మెరుగుపరిచే ప్రయత్నం జరుగుతుంది.
డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ మార్పులు: ఆర్బీఐ వినియోగదారుల డేటా భద్రతను మరింత పటిష్టం చేసేందుకు డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులు చేసింది. సురక్షిత నగదు బదిలీ, కేవైసీ విధానాల అభివృద్ధి ద్వారా వినియోగదారులకు మరింత రక్షణ కల్పించడమే లక్ష్యంగా కొత్త మార్పులు తీసుకు వచ్చింది.
ఎల్పీజీ సిలిండర్ ధరలు: నవంబర్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలు సవరించబడనున్నాయి. ఇది సాధారణ వినియోగదారులతో పాటు వ్యాపార రంగాలపైనా ప్రభావం చూపనుంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మార్పులు: స్టేట్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులపై నెలకు 3.75% ఫైనాన్స్ ఛార్జీని అమలు చేయనుంది. అలాగే రూ.50,000పైగా ఉన్న యూటిలిటీ బిల్లులపై 1% అదనపు ఛార్జ్ విధించనుంది. ఈ మార్పులు డిసెంబర్ 1నుంచి అమల్లోకి వస్తాయి.
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ గడువు: ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టుబడికి చివరి తేదీ నవంబర్ 30గా నిర్ణయించింది. ఈ ప్రత్యేక స్కీమ్‌లో 400 రోజుల కాలానికి 8% వడ్డీ రేటు సూపర్ సీనియర్ సిటిజన్‌లకు అందించనుంది.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మార్పులు: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ఫీజు నిర్మాణం, రివార్డ్ ప్రోగ్రామ్లలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో బీమా, లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌చార్జ్ మినహాయింపులు ఉండవచ్చు. ఈ మార్పులు నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.
అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్: భారతీయ రైల్వే ముందస్తు టికెట్ బుకింగ్ కాలాన్ని తగ్గించి, ఇప్పుడు 60 రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే బయలు దేరే రోజు ఈ పరిమితి వర్తించదు.