అత్యధిక డబ్బుతో రంగంలోకి ప్రీతి జింటా.. 

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఫైనల్ కప్ కొట్టలేదు. ఆ జట్టు కంటే కూడా కో ఓనర్ ప్రీతీ జింటా ద్వారా జట్టుకు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే సీజన్ లో పంజాబ్ జట్టు పర్సులో ఎక్కువ డబ్బు ఉండడం విశేషం. జట్టు ఏదైనా సరే 2025 సీజన్ కోసం 120 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలి.  ఇక వచ్చే సీజన్‌ కోసం పంజాబ్ ఆటగాళ్లను రిటైన్ చేసే విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. 

మెగా వేలానికి ముందు ఇతర జట్లు ఆరుగురు ఆటగాళ్లను నిలబెట్టుకునే అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పటికీ, పంజాబ్ కింగ్స్ మాత్రం కేవలం ఇద్దరినే రిటైన్ చేసుకునేందుకు సిద్దమవుతోంది. ఈ ఎంపిక ప్రాధాన్యం అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు ఇవ్వడం విశేషం. ఫ్రాంచైజీ వర్గాల సమాచారం ప్రకారం, పంజాబ్ కింగ్స్ ఈసారి పూర్తి కొత్త జట్టును నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో, గత సీజన్‌లో ప్రదర్శనలో కీలక పాత్ర పోషించినప్పటికీ, స్టార్ ఆటగాళ్లలో కొందరిని విడిచిపెట్టనుంది. 

తాజా జాబితాలో శశాంక్ సింగ్, ప్రభసిమ్రాన్ సింగ్ మాత్రమే లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన శశాంక్ సింగ్ 354 పరుగులు సాధించి తనదైన బ్యాటింగ్ శైలితో ఆకట్టుకున్నాడు. అలాగే ఓపెనర్‌గా తనదైన శైలిలో అదరగొట్టిన ప్రభసిమ్రాన్ సింగ్ గత సీజన్‌లో 334 పరుగులతో ఆకర్షణీయ ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.4 కోట్ల చొప్పున, మొత్తంగా రూ.8 కోట్లను కేటాయిస్తుండగా, మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ వద్ద రూ.112 కోట్ల పర్స్ అందుబాటులో ఉంటుంది. 

ప్రస్తుతం అందరికంటే ఎక్కువ డబ్బు ఇప్పుడు ప్రీతీ జింతా టీమ్ దగ్గరే ఉంది. వీరి రిటెయిన్ స్ట్రాటజీ కారణంగా, మెగా వేలంలో కొత్త బలగాన్ని తెచ్చి పంజాబ్ కింగ్స్ విభిన్న వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఉద్దేశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మార్పులతో పంజాబ్ కింగ్స్ సరికొత్తగా జట్టును రూపకల్పన చేసి, విజయం కోసం ప్రణాళికలను సిద్దం చేస్తుంది. మరి ఈసారైనా జట్టు ఫైనల్స్ వరకు వెళ్లి ఛాంపియన్ గా నిలుస్తుందేమో చూడాలి.