భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలు క్రికెట్ పరంగా మరింత హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు గత కొన్నేళ్లుగా జరగడం లేదు. భారత్ 2008 నుంచి పాకిస్థాన్‌లో ఏ సిరీస్‌లోనూ తలపడలేదు. కేవలం ఇతర దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నమెంట్లలో లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి
ఇదే సమయంలో ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ఒకరితో ఒకరు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్థాన్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి సహకరిస్తుందా లేదా అన్నది అసలు ప్రశ్న. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగనుంది.
ఇక భారత్ ఆ దేశం వెళ్లి ఆడకపోతే ఛాంపియన్స్ ట్రోపికి అర్ధమే ఉండదని చాలామంది నిపుణులు చెబుతున్న మాట. ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్-పాక్ టెస్టు సిరీస్ సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న థాంప్సన్, మీడియాతో మాట్లాడారు.
భారత్ పాకిస్థాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి రాకపోతే, అది క్రికెట్ ప్రయోజనాలకు పెద్ద నష్టం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న ఐసీసీ చైర్మన్ జై షా, గతంలో బీసీసీఐలో కీలకమైన పాత్ర పోషించారని థాంప్సన్ పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.
భౌగోళిక రాజకీయాలు క్రీడా సంబంధ సమస్యలుగా మారడం మంచిది కాదని, భారత్ లేకుండా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం అనేది ఆమోదయోగ్యమైనది కాదని పేర్కొన్నారు. ఇక పాకిస్థాన్‌తో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ పాల్గొనేందుకు మార్గం ఖచ్చితంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.