ఎవరెన్ని చెప్పినా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న మిత్రత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదు. సంబంధాలు సరిగా ఉన్న వేళ.. అనవసరమైన చిక్కులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న సందేహం కలుగక మానదు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సామర్థ్యం మీద జగన్ కు ఎలాంటి సందేహాలు లేవనే చెబుతారు. జగన్ పట్టుదల గురించి సీఎం కేసీఆర్ కు బాగా తెలుసన్న విషయాన్ని ఆయన సన్నిహితుల నోట వినిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉండే ఈ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త లొల్లికి కారణమైందని చెప్పాలి.
ఐదు రోజుల క్రితం ఏపీ సర్కారు కొత్త ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడుతూ జీవోను విడుదల చేశారు. శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తీసుకెళ్లేందుకు వీలుగా ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసినట్లు తెలంగాణ వాదిస్తోంది. అదేమీ లేదు.. ఏపీ వాటా నీటిని మాత్రమే మళ్లించే ఉద్దేశం తప్పించి.. ఇంకెలాంటి ఉద్దేశాలు లేవని ఏపీ సర్కారు వివరణ ఇస్తోంది.
తెలంగాణ విపక్షాల వాదనల్ని పక్కన పెడితే.. ఈ వ్యవహారంలో జగన్ కాస్త ముందుచూపుతో వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను నిర్మించాలనుకుంటున్న ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించి.. ఆయన చేత ఓకే అనిపించుకుంటే పోయేదన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా షురూ చేయనున్న ప్రాజెక్టు వివరాల్ని ముందే కేసీఆర్ చెవిన వేసి ఉంటే.. లొల్లి షురూనే అయ్యేది కాదని చెప్పాలి.
తన మాటలతో ఎలాంటి అభిప్రాయాన్ని అయినా ప్రజల్లో కలిగించటంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టాలెంట్ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు. అలాంటప్పుడు.. ఏపీలో చేపట్టనున్న ప్రాజెక్టు వివరాల్ని సీఎం కేసీఆర్ కు వివరంగా చెప్పటం ద్వారా అనవసరమైన లొల్లికి చెక్ పెట్టే అవకాశాన్ని ఏపీ సీఎం జగన్ చేజార్చుకున్నట్లు చెబుతున్నారు.
ఇప్పుడు పరిస్థితి చేజారిపోవటమే కాదు.. తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా జగన్ సర్కారు తీరు ఉందన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఇలాంటివేళ..ఏపీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించేలా సీఎం కేసీఆర్ వ్యవహరించే అవకాశం ఉండదు. ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ చెవిన జగన్ కానీ ఒక మాట వేసి ఉంటే ఈ రోజు సీన్ మరోలా ఉండేదని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates