టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్.. వన్డే, టీ20 జట్ల వైస్ కెప్టెన్ కూడా అయిన రోహిత్ శర్మ పరిస్థితి అయోమయంగా ఉందిప్పుడు. రెండు వారాల కిందట తొడ కండరాల గాయానికి గురై రోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన అతణ్ని.. వచ్చే నెల 27న ఆరంభమై నెలన్నర పాటు సాగే ఆస్ట్రేలియా పర్యటన మొత్తానికి దూరం పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
రోహిత్ గాయం మరీ అంత తీవ్రమైందా.. ఇప్పుడే గాయంపై అలా ఓ అంచనాకు వచ్చేసి ఆస్ట్రేలియా పర్యటన మొత్తానికి తప్పించడం సరైందేనా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదంతా కోహ్లీ పనే అంటూ రోహిత్ అభిమానులు అతడిపై విరుచుకుపడిపోయారు. రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కట్ చేస్తే రోహిత్ తన గాయం అంత తీవ్రమైందేమీ కాదన్నట్లుగా నెట్ ప్రాక్టీస్ కొనసాగించాడు. సెలక్టర్లు చేసింది తప్పు అని రుజువు చేయడానికా అన్నట్లు మంగళవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ కూడా ఆడేశాడు.
కానీ మ్యాచ్‌లో రోహిత్ ఏమాత్రం చురుగ్గా కనిపించలేదు. నాలుగు పరుగులే చేసి వెనుదిరిగాడు. ఫీల్డింగ్‌లోనూ ఎఫెక్టివ్‌గా లేడు. కెప్టెన్‌గా కూడా ప్రభావం చూపలేకపోయాడు. రోహిత్ పునరాగమనం చేయడానికి ముందు మంచి ఊపు మీద కనిపించిన ముంబయి.. అతను తిరిగొచ్చిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసింది. దీంతో రోహిత్ మీద నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘థ్యాంక్ యు రోహిత్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని ఆటాడుకుంటున్నారు నెటిజన్లు.
రోహిత్ తిరిగొచ్చి పేలవంగా ఆడటమే కాక.. బుమ్రా, బౌల్ట్‌లను మ్యాచ్‌కు దూరంగా పెట్టడం, కెప్టెన్‌గానూ విఫలమవడం ద్వారా సన్‌రైజర్స్‌కు పెద్ద సాయమే చేశాడంటూ అతడి మీద సెటైరిక్ ట్వీట్లు వేస్తున్నారు. అతడి ఫిట్‌నెస్ మీద ఎన్నో మీమ్స్ పడ్డాయి. దారుణమైన కామెంట్లతో రోహిత్‌తో పాటు అతడి అభిమానులను ఎద్దేవా చేస్తున్నారు వ్యతిరేకులు. ఇందులో రోహిత్‌ను, ముంబయిని వ్యతిరేకించే వాళ్లు పెద్ద ఎత్తునే భాగమైనట్లు స్పష్టమవుతోంది.