528, 562, 848, 641, 692, 501.. ఏమిటీ గణాంకాలు అంటారా..? ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ గత ఆరేళ్లలో వరుసగా సాధించిన పరుగులు. ఆరేళ్లుగా అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ఆడుతున్నాడు. ప్రతిసారీ 500కు పైగా పరుగులు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. 2016లో ఏకంగా 848 పరుగులు చేసి టోర్నీ టాప్-2 రన్ గెటర్‌గా నిలవడమే కాదు.. జట్టుకు కప్పు కూడా అందించాడు.
ఆ తర్వాతి సీజన్లలో సన్‌రైజర్స్ జట్టు ప్రదర్శన అంచనాలకు తగ్గట్లు లేకపోయినా వార్నర్ మాత్రం విఫలమైంది లేదు. తన పాటికి తాను పరుగుల వరద పారించేస్తున్నాడు. సీజన్ సీజన్‌కూ తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నాడు. ఈ సీజన్లోనూ సన్‌రైజర్స్ తడబడ్డా సరే.. వార్నర్ మాత్రం నిలకడ కొనసాగించాడు.
అసలు ప్లేఆఫ్ రేసుకు దూరమైపోయినట్లే అనుకున్న దశలో ఢిల్లీపై వార్నర్ ఎలా చెలరేగిపోయాడో అందరూ చూశారు. ఆ మ్యాచే సన్‌రైజర్స్ ప్రయాణంలో మలుపు. ఇప్పుడు చావోరేవో అనదగ్గ ముంబయి మ్యాచ్‌లోనూ వార్నర్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 150 పరుగుల ఛేదనలో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో వార్నర్ కచ్చితంగా నిలబడతాడు, జట్టును గెలిపిస్తాడు, ప్లేఆఫ్ చేరుస్తాడు అని అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అతను నిజం చేశాడు. ఐపీఎల్‌లో మరే ఆటగాడికీ సాధ్యం కాని నిలకడ అతడిది. కోహ్లి సైతం ఇంత నిలకడగా ఆడి జట్టును నడిపించట్లేదంటే అతిశయోక్తి కాదు. సన్‌రైజర్స్ జట్టుకు గుర్తింపు, ఆదరణ పెరగడంలో వార్నర్ పాత్ర అత్యంత కీలకం.
అంతకుముందు ఆడిన జట్లలో వార్నర్ అంత గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. సన్‌రైజర్స్‌లోకి వచ్చాకే అతను రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఆ జట్టు అభిమానులతో అతడికి పెద్ద బాండ్ ఏర్పడిపోయింది. తెలుగు అభిమానులు సోషల్ మీడియాలో వార్నర్ మావా అంటూ సరదాగా సంబోధిస్తూ అతడి మీద తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే లాక్ డౌన్ టైంలో తెలుగు పాటలకు టిక్‌టాక్‌లో అదిరిపోయే స్టెప్పులేసి వారి మనసుల్లోకి మరింతగా చొచ్చుకెళ్లాడు. మైదానం బయట అంత ఫన్నీగా ఉండే వార్నర్.. గ్రౌండులోకి వచ్చాడంటే చాలా సీరియస్ అయిపోతాడు. ఎక్కడలేని కమిట్మెంట్ చూపిస్తాడు. అందుకే అతడి ప్రదర్శన అంత గొప్పగా ఉంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates