అన్న‌దాత‌లతో కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

అన్న‌దాత‌లతో కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ నేతృత్వం వ‌హించిన రైతు ర్యాలీ సంద‌ర్భంగా తెలంగాణ నుంచి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు బాగానే హ‌డావుడి చేశారు. దీనికి సంబంధించి పార్టీ అధినాయ‌క‌త్వం సైతం సంతోషంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. త‌మ క‌ష్టాన్ని గుర్తించిన పార్టీ అధినాయ‌క‌త్వంతో మాంచి హుషారు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై త‌మ పోరును మ‌రింత ఉదృతం చేయాల‌ని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ఢిల్లీలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌టం వ‌ల్ల‌.. ఆంగ్ల ఛాన‌ళ్ల‌ను త్వ‌ర‌గా ఆక‌ర్షించొచ్చు. అంతేకాదు.. తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్ర స‌ర్కారుపై చేసే విమ‌ర్శ‌లతో జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు రేపే అవ‌కాశం ఉంది. అన్నింటికి మించి తెలంగాణ అధికార‌ప‌క్షంపై తాము ఏ స్థాయిలో పోరాడుతున్నామ‌న్న విష‌యం పార్టీ అధినాయ‌క‌త్వానికి తెలియ‌జెప్పే అవ‌కాశం ఉంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన టీ పీసీసీ చీఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షంపై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై నిర్లక్ష్యం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్ర‌తి రోజూ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని.. ఇంత జ‌రిగినా కేసీఆర్ స‌ర్కారు అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదంటూ విరుచుకుప‌డ్డారు.

బంగారు తెలంగాణ అంటూ.. రోజు ర‌కంగా హ‌డావుడి చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం.. మాట‌ల్లో త‌ప్ప చేత‌ల్లో చేస్తున్న‌దేదీ లేద‌న్న విష‌యాన్ని మ‌రింత ప్ర‌చారం తీసుకొచ్చేలా ఉత్త‌మ్ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల స‌మ‌స్య చాలా ఎక్కువ‌గా ఉంద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా 69 మంది రైతులు మాత్ర‌మే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌ట్లు కేసీఆర్ స‌ర్కారు అబ‌ద్ధ‌పు నివేదిక ఇచ్చింద‌ని.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మెద‌క్ జిల్లాలోనే ఇప్ప‌టివ‌ర‌కూ 70 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని వెల్ల‌డించారు.తాను చెబుతున్న సంఖ్య మాట వ‌ర‌స‌కు చెప్ప‌టం లేద‌ని.. స‌హ చ‌ట్టం ద్వారా ప్ర‌భుత్వం ఇచ్చిన అధికారిక స‌మాచారం ఆధారంగానే తాను చెబుతున్నాన‌ని ఉత్త‌మ్ మండిప‌డ్డారు.

రైతుల‌కు మ‌నోధైర్యం క‌లిగేలా తెలంగాణ స‌ర్కారు స్పందించాల‌ని.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతు కుటుంబాలు ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. చూస్తుంటే రానున్న రోజుల్లో రైతుల ఎజెండాతో కేసీఆర్ స‌ర్కారుపై ఉత్త‌మ్ అండ్ కోలు విరుచుకుప‌డే అవ‌కాశం ఉందంటున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు