బాబు చేసిన పొరపాటే జగన్ కూడా చేస్తున్నారా?

రాజకీయంగా ఒప్పులు చేయకున్నా ఫర్లేదు తప్పులు మాత్రం చేయకూడదు. బలంగా ఉన్నప్పుడు.. అందునా అధికారంలో చేతిలో ఉన్నప్పుడు చేసే తప్పులు కొట్టుకుపోతాయి. అయితే.. తర్వాతి రోజుల్లో మత్రం ఇవన్నీ కలిసి కట్టుగా దండయాత్ర చేసినట్లుగా మీద పడతాయి. అప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పవు. అందుకు నిలువెత్తు రూపంగా టీడీపీ అధినేత చంద్రబాబును చెప్పొచ్చు.

తెలుగు రాజకీయాల్లో ప్రతి విషయంలోనూ బాబును వేలెత్తి చూపించినంతగా మరే నేతను ఎవరూ చూపించరు. దీనికి కారణం.. చాలా విషయాల్లో బాబు అనుసరించిన విధానమే అని చెబుతారు. మరిన్ని తప్పులు చేసి కూడా అంతబలమైన నాయకుడిగా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారంటే.. దాన్నే కాలమహిమగా చెబుతారు. పవర్ వచ్చినంతనే అప్పటివరకూ లేని కొత్త ఇమేజ్ చాలామందిలో వస్తుంది. అదంతా గెలుపు పుణ్యంగా చెప్పొచ్చు.

ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికే వస్తే.. ఆయన తీసుకునే నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించే స్థితిలో లేరు. ఆ మాటకు వస్తే.. ఆయన్ను ప్రభావితం చేసేటోళ్లు కూడా ఎవరూ లేరు. ఆ మాటకు వస్తే.. చంద్రబాబును ప్రభావితం చేసే కొన్ని లాబీలు.. వ్యక్తులు ఉండనైనా ఉన్నారు. కానీ.. జగన్ అందుకు భిన్నం.

ఆయన ఏమనుకుంటే అదే ఫైనల్. ఎవరూ ఆయన మనసును మార్చలేరు. అంతటి పవర్ ఆయన సొంతం. అలాంటి జగన్.. కొన్ని విషయాల్లో తప్పులు చేస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. పార్టీలో ఎంతోకాలంగా పని చేస్తూ.. జగన్ ఇచ్చే పదవుల కోసం చకోర పక్షుల మాదిరి వెయిట్ చేసేటోళ్లకు కొదవ లేదు. అయినప్పటికీ ఆయన మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కేటాయిస్తున్న తీరుపై మాత్రం కినుకు వ్యక్తమవుతోంది. అయితే.. అదేమీ బయటకు రావట్లేదు. తమ ప్రైవేటు సంభాషణల్లో అది కూడా చాలా నమ్మకమైన వారి వద్ద మాత్రమే తమ ఫీలింగ్స్ ను చెబుతున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట ఉన్న వారిలో కొందరికి సరైన పదవులు లభించింది లేదు. కానీ.. పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత వచ్చే ప్యారాచూట్ నేతలకు మాత్రం పదవులు వస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బాబు కూడా ఇలాంటి తీరునే ప్రదర్శిస్తారన్న పేరుంది. మొన్నటికి మొన్న డొక్కా విషయంలోనూ అదే జరిగింది. అంతకు ముందు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది.

తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీల ఎంపికలోనూ పండుల రవీంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆయనకు టికెట్ ఇవ్వకపోవటం.. తర్వాత సర్దుబాబు చేస్తానని చెప్పిన దానికి తగ్గట్లే.. ఆయనకు ఎమ్మెల్స ఇచ్చినట్లుగా చెబుతారు. ఇప్పటికే పదవుల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మందిని వదిలి రవీంద్రబాబుకు ఇవ్వటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

నిజంగానే రవీంద్రబాబుకు న్యాయం చేయాలంటే ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ గిరి ఇవ్వొచ్చుగా? అన్న మాట కొందరి నోట వినిపిస్తుండటం గమనార్హం. బాబు మాదిరే జగన్ సైతం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయటం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఈ విషయాన్ని జగన్ గుర్తిస్తున్నారా?