నేనెంత చేస్తున్నానంటే...

నేనెంత చేస్తున్నానంటే...

ఎవరు ఎంత పని చేసినా.. చేసిన పని గురించి చక్కగా చెప్పుకోలేకపోతే ప్రయోజనం ఉండదు. అయితే.. ఈ వాదాన్ని చాలామంది ఒప్పుకోరు. పని చేశాక.. మళ్లీ ప్రత్యేకంగా చెప్పుకోవటమేమిటని వాదించేవారు ఉంటే.. తమ ప్రతిభను గుర్తించటంలో ఫెయిల్‌ కావటం తమపై అధికారుల చేతగానితనం మాత్రమే అంటూ సుదీర్ఘంగా వాదించేవారు చాలామందే ఉంటారు.

ఎవరెన్ని చెప్పినా.. ఒక్క విషయం మాత్రం నిజం. ఒక పని చేసిన వ్యక్తి.. తానేం చేశాను... అందుకోసం ఎంత కష్టించిందన్న విషయంతో పాటు.. దాని కారణంగా తాను సాధించిన విషయాల గురించి ఎంతోకొంత చెప్పాల్సిన బాధ్యత ఉందనే చెప్పాలి. ఒక వ్యక్తి చాలా సాధించినప్పుడు.. తనకు సన్నిహితగా ఉన్న వారితో షేర్‌ చేసుకోవటం చాలా మామూలుగా చేస్తారు. ఇది తప్పా.. ఒప్పా అన్న విషయాన్ని పక్కనపెడితే.. అలా చెప్పుకోవటం ద్వారా సదరు వ్యక్తి చాలా సంతోషానికి గురి అవుతారు.

చెప్పుకోవటం ద్వారా సంతోషపడే వ్యక్తి.. తన పై అధికారికి చెప్పుకోవటానికి మాత్రం చిన్నతనంగా ఫీలవుతారు. అంటే..చేసిన పని చిన్నదైనా కావాలి. లేదంటే.. చేసింది చెప్పుకునే వాతావరణం లేకుండా అయినా ఉండాలి. అంతే తప్ప.. చేసింది చెప్పుకోవటం ఎప్పటికైనా లాభమే ఉంటుంది తప్ప నష్టం మాత్రం ఉండదు.

తాజాగా.. గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటననే చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన వరుస పెట్టి ప్రముఖులందరిని కలుస్తున్నారు. ఎందుకంటే.. తాను గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వటంతో పాటు.. నిన్నమొన్నటి వరకూ ఉప్పునిప్పులా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుళ్లు ఒక వేదిక మీదకు రావటమే కాదు.. వారి మధ్య సమావేశం సానుకూల వాతావరణంలో సాగటమే.

తాను సాధించిన పలితాన్ని తన సూపర్‌ బాస్‌లకు చెప్పుకోవటం.. వారికి అందించాల్సిన సమాచారాన్ని అందించటంతో పాటు.. తన అబ్జర్వేషన్లను తెలిపేందుకే గవర్నర్‌ తాజా పర్యటనగా చెప్పొచ్చు. రెండు రాష్ట్ర నేతల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించటంతో పాటు.. వారి మధ్య ఉన్న పంచాయితీలను పుల్‌స్టాప్‌ పెట్టేలా తానేం చేసింది ఆయన చెప్పుకున్నట్లు సమాచారం.  లేటెస్ట్‌ అప్‌డేట్‌తో పాటు..విభజన చట్టం ద్వారా తనకు దక్కాల్సిన అధికారాలకు సంబంధించిన అంశాన్ని మరింత ముందుకు తీసుకెళితే.. మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని చెప్పటం కూడా పర్యటనలో భాగంగా చెప్పొచ్చు.

అదే మిగిలిన రాష్ట్రాల గవర్నర్లకు.. నరసింహన్‌కు వ్యత్యాసంగా చెప్పాలి. విపత్కర పరిస్థితుల్ని సమర్థవంతంగా డీల్‌ చేయటం.. సదరు రాష్ట్రంలో ఉన్న కేంద్రం ప్రతినిధిని అన్న విషయాన్ని మర్చిపోకుండా.. ఎప్పటికప్పుడు విషయాలను సూపర్‌ బాస్‌లకు విన్నవించటం ద్వారా.. వారికి విధేయుడిగా.. పనిమంతుడి మాదిరి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాల గవర్నర్లు.. నరసింహన్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉందని చెప్పాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు