డేంజర్‌ గేమ్‌ మొదలెట్టిన కేసీఆర్‌ ఫ్యామిలీ

డేంజర్‌ గేమ్‌ మొదలెట్టిన కేసీఆర్‌ ఫ్యామిలీ

ప్రాంతీయ విద్వేషాలతో రాజకీయాలు నడిపి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు.. అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్‌ ఇప్పుడా అధికారాన్ని వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా అభిలషిస్తున్నారు.

కారణం లేకుండా ఏ పని చేయని కేసీఆర్‌.. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విషయంలో 1956 ముందు తెలంగాణలో జన్మించిన వారికే వర్తిస్తుందని చెప్పటమే కాకుండా.. ఆంధ్రోళ్లు వేరు.. తెలంగాణ వారు వేరన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ వారి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నట్లు చెబుతూనే.. పలువురు తెలంగాణ వారికి సైతం స్థానికత ముసుగులో ఫీజులు ఎగకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందామంటూ భావోద్వేగ నినాదాలు చేసిన కేసీఆర్‌.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న నాటి నుంచి మైనార్టీలను దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు.. హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేయటంతో మైనార్టీలు కీలకమన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. అందుకే.. మైనార్టీలను మురిసిపోయేలా వరాలు ప్రకటిస్తూ.. వారి ఓటుబ్యాంకును చీల్చే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఒక దళితుడన్న విషయాన్ని ఎంత బలంగా చెప్పారో అందరికి తెలుసు. తెలంగాణ వచ్చాక తెలంగాణకు తానే తొలి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను ఎంత బలంగా చాటారో తెలుసు. తాజాగా.. మైనార్టీల మునసుల్ని గెలుచుకునేందుకు టీ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జాను ఎంపిక చేసుకోవటంతో పాటు.. ఆమెకు రూ.కోటి నజరానాను ప్రకటించారు. మైనార్టీలకు దగ్గరయ్యేందుకు పాకిస్థానీ కోడలతో ఆయన రాజకీయాలు మొదలెట్టారు.

పెళ్లి తర్వాత తాను దుబాయ్‌లో స్థిరపడతానని తేల్చి చెప్పిన సానియా మీర్జా తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఏ విధంగా అయ్యిందో కేసీఆర్‌సాబ్‌కే తెలియాలి. ఆ విషయంలో ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఆయన లక్ష్యం మాత్రం మైనార్టీలకు దగ్గర కావటమే. అందుకే.. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా మీర్జాను ఎంపిక చేయటంలో పెద్ద వ్యూహమే ఉందని చెప్పాలి.

అందులో ఒకటి మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పుకోవటం.. మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ.. తన ఓటు మైనార్టీలకే అన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. సానియామీర్జా నియామకం మీద విమర్శలు వచ్చినా.. వాటన్నింటినీ హిందుత్వ ఖాతాలో వేసేసి.. కేంద్రం అడుగులకు మడుగులు వత్తే సర్కారు తమది కాదని.. మైనార్టీల పక్షపాతి అన్న విషయాన్ని చెప్పేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి.

అదే సమయంలో ఆయన కుమార్తె కాశ్శీర్‌.. భారత్‌ అంతర్భాగం కాదన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం ద్వారా.. అసంతృప్త మైనార్టీలకు మనసుల్ని సేద తీర్చటమేనని చెప్పాలి. నిన్నకాక మొన్న ఎంపీగా ఎన్నికైన కవిత.. తన స్థాయికి మించిన పెద్దపెద్ద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇక్కడో విషయాన్ని గుర్తించాలి. కుమార్తె తొందర పడి ఉంటే.. కేసీఆర్‌ సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అదేం చిత్రమో కానీ.. కవిత అంత పెద్ద వ్యాఖ్య చేసినా.. కేసీఆర్‌ మాత్రం అస్సలు స్పందించలేదనే చెప్పాలి. ప్రాంతీయ వాదంతో విజయం సాధించిన కేసీఆర్‌... ప్రమాదకరమైన మత రాజకీయాల గేమ్‌ప్లాన్‌ ఎంతవరకు వర్క్‌వుట్‌ అవుతుందో చూడాలి. పులి మీద స్వారీ చేయటం మొదలుపెట్టాక.. దిగేందుకు ఉండదని.. ఎంతకూ దాని పైనే స్వారీ చేస్తుండాలన్న విషయాన్ని కేసీఆర్‌ మర్చిపోకూడదనే కోరుకుందాం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు