వైఎస్సార్సీపీకి మళ్లీ పురిటి నొప్పులు!

వైఎస్సార్సీపీకి మళ్లీ పురిటి నొప్పులు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి షురూ అయ్యింది! ఇప్పటికే నియోజకవర్గాల్లో కన్వీనర్లను నియమించుకుని కొన్ని పేచీల పంచాయతీలు తీర్చడంలో బిజీగా ఉన్న ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు మరోసారి ఆ కన్వీనర్ల విషయంలో కెలకాలని భావిస్తోందట. దాదాపు రెండు వందల నియోజకవర్గాల వరకూ కన్వీనర్ల నియామకాలు పూర్తయ్యాయని వైకాపా వాళ్లు గర్వంగా చెప్పుకున్నారు ఇన్ని రోజులూ. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సరిగా పనిచేయడం లేదు అనే రిపోర్టులు అందిన కన్వీనర్లను తొలగించాలని జగన్ పార్టీ భావిస్తోంది.

దీంతో పార్టీలో కొత్త ముసలం పుట్టినట్టు అవుతోంది. కన్వీనర్లుగా నియామకం అయిన వారంతా వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఖాయమని భావిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నపళంగా ఆ తమ హోదాలు పోతాయని తెలిస్తే వారిలో రేగే అసంతృప్తి జ్వాల అంతా ఇంతా కాదు! చేతిలోని తాయిలాన్ని లాక్కొంటే వారు ఊరికే ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు. ఇన్ని రోజుల పాటు పెట్టుకున్న ఆశలు, పెట్టుకున్న ఖర్చులను లెక్కలోకి తీసుకుని వారంతా పార్టీలో అలజడి పుట్టించే అవకాశాలున్నాయి.

గతంలో కన్వీనర్ల నియామకం సందర్భంలోనే చాలా అసంతృప్తస్వరాలు వినిపించాయి.  జగన్ అరెస్టు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు అంతగా విజయవంతం చేయని నాయకులందరినీ రంగం నుంచి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. హైదరాబాద్ లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం కూడా అంత విజయవంతం కాకపోవడంతో వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు గనుక నియోజకవర్గ కన్వీనర్లను తప్పించి, కొత్త నాయకులను వారి స్థానంలో నియమించుకోవడం  మొదలుపెడితే...వైఎస్సార్ సీపీకి మళ్లీ పురిటి నొప్పులు వచ్చినట్టే లెక్క!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు