గౌతం స‌వాంగ్‌కు కీల‌క ప‌ద‌వి.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం

ఏపీ మాజీ డీజీపీ గౌతం స‌వాంగ్‌ను ప్ర‌భుత్వం అత్యంత కీల‌క‌మైన‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌( ఏపీపీఎస్సీ) చైర్మ‌న్‌గా నియ‌మించింది. రాష్ట్రంలో ఉద్యోగుల నిర‌స‌న‌ల నేప‌థ్యంలో విజయ‌వాడ‌లో నిర్వ‌హించి న చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ర్కారు.. ఈ క్ర‌మంలో డీజీపీ గౌతం స‌వాంగ్ ను ఇటీవ‌ల ఆ ప‌ద‌వి నుంచి దింపేసిన విష‌యం తెలిసిందే.  ఏపీ ప్ర‌భుత్వం అనుకున్న విధంగా ఉద్యోగులు ఉద్య‌మాన్ని కంట్రోల్ చేయ‌డంలో డీజీపీ స‌వాంగ్ విఫ‌లం చెందార‌ని.. దీనిపై సీఎం కూడా హుటాహుటిన డీజీపీని పిలిపించుకుని.. మాట్లాడడం వంటి ప‌రిణామాలు రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీశాయి.

ఈ క్ర‌మంలో  ఏపీ ప్ర‌భుత్వం డీజీపీ గౌతం స‌వాంగ్‌ను ప‌క్క‌న పెట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌కుండా  ప‌క్క‌న పెట్టింది. దీంతో ఆయ‌న‌ను  అవ‌మానించిందంటూ.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని గౌతమ్‌ సవాంగ్‌కి ప్రభుత్వం అప్ప‌ట్లో ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.  మ‌రోవైపు ప్రభుత్వం ప‌క్క‌న పెట్టిన గౌతమ్‌ సవాంగ్‌కి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వక‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా గత రెండు రోజుల క్రితం  బదిలీ అయిన రాష్ట్ర మాజీ డీజీపీ గౌతం సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్- APPSC ఛైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప‌ద‌విలో ఆయ‌న ఐదేళ్ల పాటు ఉంటారు.

కేబినెట్ హోదాతో స‌మాన‌మైన‌.. స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ కూడా అయిన‌.. ఏపీపీఎస్సీకి చైర్మ‌న్‌గా నియ‌మించ‌డం.. ఆశించిన ప‌రిణామ‌మే అవుతుంది. పైగా.. ఒక రాష్ట్రేతర వ్య‌క్తికి ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం ఆస‌క్తిగా మారింది. పైగా.. ప్ర‌స్తుతం ఆయ‌న ఐపీఎస్‌గా వ‌చ్చే ఏడాది జూలై వ‌ర‌కు కొన‌సాగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ను ఈ ప‌ద‌విలో పెట్ట‌డం ద్వారా.. వ‌చ్చే ఐదేళ్ల‌కు అంటే..ఆయ‌న రిటైర్ అయిన త‌ర్వాత‌.కూడా ఆయ‌నను గౌర‌వించిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుంది. మొత్తానికి త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఆస‌క్తిగా మారింది.