బ‌స్సు క‌ద‌ల్లేదా.. జ‌గ‌న్‌కు క‌ష్ట‌మే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. ఓ వైపు ఆర్థిక వ్య‌వ‌స్థ రోజురోజుకూ దిగ‌జారుతున్నా సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాల‌కు ఆయ‌న డ‌బ్బులు పంచుతూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా ప్ర‌క‌టించి పీఆర్సీపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పటికే సీఎస్‌కు స‌మ్మె నోటీసు కూడా అంద‌జేశారు. ఈ నెల ఆరు అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు జ‌గ‌న్ కానీ ప్ర‌భుత్వం కానీ ఈ స‌మ్మెను సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. స‌మ్మెకు వెళ్తే ఉద్యోగుల‌కే ప్ర‌జ‌ల్లో చెడ్డ పేరు వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుత ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్న ప‌రిస్థితుల్లో ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌డం స‌రికాద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. చ‌ర్చ‌ల కోసం మంత్రుల క‌మిటీ ఎదురు చూసిన‌ప్ప‌టికీ ఉద్యోగ నేత‌లు రాలేద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు పీఆర్సీ సాధ‌న స‌మితిగా ఏర్ప‌డ్డ ఉద్యోగ సంఘాల నేత‌లు వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని అంటున్నారు. అన్ని ప్ర‌భుత్వ వ‌ర్గాల ఉద్యోగుల‌ను క‌లిపుకొని స‌మ్మెకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఈ స‌మ్మెకు మ‌ద్ద‌తు తెల‌ప‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌భుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన‌ప్ప‌టికీ కార్మికుల స‌మ‌స్య‌లు తీర‌లేద‌ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయ‌కులు పేర్కొన్నారు. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం స‌మ్మెకు సై అంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌పై దృష్టి సారించ‌కుంటే ఏడో తేదీ నుంచి ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డే ఆపేస్తామ‌ని హెచ్చ‌రించారు.  ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసిన‌ప్పుడు జ‌గ‌న్‌ను ఆకాశానికెత్తేసిన కార్మికులు.. ఇప్పుడ‌దే సీఎంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పీఆర్సీ సాధ‌న స‌మితికి మ‌ద్ద‌తుగా ఆర్టీసీ కూడా స‌మ్మె చేస్తే బ‌స్సు చ‌క్రాలు ఆగితే జ‌గ‌న్‌కు ఇబ్బంది త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు దిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణా స్తంభించిపోతుంది. ఉద్యోగుల స‌మ్మెపై ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌భుత్వం ఒక‌వేళ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పూర్తిస్థాయిలో బస్సులు న‌డిచేది అనుమాన‌మే. కానీ ఈ విష‌యం ఇబ్బందులు ఎదురైనా త‌గ్గేదేలే అన్న‌ట్లు జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంటున్నారు. తెలంగాణ‌లో ఇలాగే జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మెను కేసీఆర్ అస్స‌లు ప‌ట్టించుకోలేదు. దీంతో కార్మికులు దిగిరాక త‌ప్ప‌లేదు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.