వైసీపీకి ఇక సెల‌వు- సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో ఫ్లెక్సీలు..

అక్క‌డ ఎటు చూసినా.. వైసీపీకి ఇక సెలవు– అనే ఫ్లెక్సీలు భారీ సంఖ్య‌లో క‌నిపిస్తున్నాయి. అందునా.. అది ఏదో.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి సొంత జిల్లానో.. నియోజ‌క‌వ‌ర్గ‌మో.. కాదు.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా!! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. క‌డ‌ప జిల్లాను విడ‌దీసి ఇటీవ‌ల రెండు జిల్లాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో రాజంపేట కేంద్రంగా అన్న‌మమ‌య్య జిల్లాను ఏర్పాటు చేయాల‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా వ‌ద్ద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు రోడ్డెక్కారు. అయితే.. వీరి గోడును అధికార పార్టీ నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. వైసీపీకి ఇక సెల‌వు.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించనందుకు అధికార పార్టీ వైసీపీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా వైసీపీకి ఆవిర్భావం నుంచి కంచుకోటలా పేరున్న ప్రధాన గ్రామాల్లో వైసీపీకి ఇక సెలవు అంటూ గ్రామాల ముఖద్వారాల వద్ద అందున హైవే రోడ్లపై హోర్డింగ్‌లు పెట్టడం తీవ్ర సంచలనంగా మారింది. అదేవిధంగా భారీ మెజారిటీతో గెలుపొందిన రాజంపేట, కోడూరు నియోజకర్గాల నేతలు కనబడుట లేదు.. వీరి ఆచూకీ తెలియజేయాలి అని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అన్నమయ్య జన్మస్థలి, పార్లమెంట్‌, రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా కనీసం మంచినీళ్లు దొరకని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా రాజంపేటకు సమీపంలోని కడప-చెన్నై హైవే రోడ్డు పక్కనున్న వైసీపీకి, ప్రధానంగా ముఖ్యమంత్రి వై.య్‌స.జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి ఆది నుంచి కంచుకోటగా పేరున్న రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లె ముఖద్వారం వద్ద ఆ గ్రామస్థులు జిల్లాల విభజన వంచనకు నిరసనగా బరువెక్కిన హృదయాలతో ‘వైఎస్ఆర్‌సీపీ’కి ఇక సెలవు… రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

అంతేకాక గ్రామంలోని మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, యువతులు, చిన్నపిల్లలు సైతం అందరూ కలిసికట్టుగా ఫ్లెక్సీ బోర్డు వద్ద నిరసన వ్యక్తం చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మ‌రి ఈ ప‌రిణామాల‌పై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.