రెండు రాష్ట్రాలు.. ఇద్దరు నేత‌లు.. బీజేపీ భ‌విత‌వ్యం ఏంటి..?

రెండు రాష్ట్రాలు.. ఇద్దరు నేత‌లు.. బీజేపీ భ‌విత‌వ్యం ఏంటి..?

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడాలని భావిస్తున్న‌ బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అటు తెలంగాణలో... ఇటు ఏపీలోనూ పార్టీ పరిస్థితిలో ఎక్కడో తేడా కొడుతోంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

పార్టీ అంచనా వేస్తోంది ఒకటి అయితే... క్షేత్రస్థాయిలో జరుగుతుంది మాత్రం మరొకటిగా కనిపిస్తోంది. ఇదే టైమ్‌లో ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే తాము బ‌ల‌పడిపోతాం ? అన్న ఆశతో మాత్రమే బిజెపి పని చేస్తుందే.. తప్ప రెండు రాష్ట్రాల్లో ప్రజల మనసులను గెలుచుకునే విషయంలో మాత్రం చాలా వెనకంజలో ఉంది.

తెలంగాణలోనూ.. ఏపీలో బీజేపీకి కీలక నేతల కొరత చాలా ఉంది అన్నది మాత్రం వాస్తవం. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామని తమ‌ వల్లే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ నేత‌లు ఎన్ని ప్రకటనలు గుప్పిస్తున్నా ఏపీ... తెలంగాణకు బిజెపి వల్ల ఒరిగేదేమీ లేదు అన్నది ప్రజలకు అర్థం అయింది. తెలుగు రాష్ట్రాల‌కు అది చేస్తాం... ఇది చేస్తాం అని బీజేపీ కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌తో మాత్ర‌మే స‌రిపెట్టుకుంటోంది. పార్టీకి జాతీయ స్థాయిలో కీల‌క నేత‌లుగా ఉన్న బీజేపీ అగ్రనేతలు రాంమాధవ్, మురళీ ధరరావులు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు.

వీరికి పార్టీ అధిష్టానం వ‌ద్ద ఎంత ప‌లుకుబ‌డి ఉన్నా.... వీరు జాతీయ స్థాయిలో ఎన్ని చ‌క్రాలు తిప్పుతున్నా వీరి సొంత రాష్ట్రాల్లో మాత్రం వీరి ప్ర‌భావం జీరో. ముర‌ళీధ‌ర్‌రావు క‌ర్నాట‌క పార్టీ వ్య‌వ‌హారాల్లో కీల‌క నేత‌. రామ్‌మాధ‌వ్ నార్త్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ పార్టీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌పెడ‌తారు. అమిత్ షాకు న‌మ్మిన‌బంటుగా ఉన్న మురళీధరరావు రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా ప‌నిచేశారు.

అయితే తెలంగాణ‌లో ఆయ‌న ఎంపీగా పోటీ చేసినా గెల‌వ‌లేదు. అక్క‌డ ఎన్ని వ్యూహాలు ప‌న్నుతున్నా ఆయ‌న ప్ర‌భావం ప్ర‌జ‌ల్లో జీరో. ఆయ‌న ఏం చెప్పినా ఇక్క‌డ ప‌ట్టించుకునే వాళ్లే లేరు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్క‌డ అధికారంలోకి రావాల‌ని బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఇప్ప‌టికే క‌నీసం 70-80 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి స‌రైన అభ్య‌ర్థులే లేరు.

ఇక ఏపీకి చెందిన రామ్‌మాధ‌వ్ సైతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ, పీడీపీ అధికారం చేపట్టడానికి రాంమాధవ్ వ్యూహమే కారణం. అమిత్ షాకు నమ్మకమైన నేత. ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు సైతం ఎక్కువుగా రామ్‌మాధ‌వ్‌ను క‌లుస్తుంటారు. ఆయ‌న ద్వారానే బీజేపీలో చేరిక‌లు ఎక్కువుగా ఉంటాయి. అయితే సొంత రాష్ట్ర‌మైన ఏపీలో ఆయ‌న్ను నాయ‌కులు త‌ప్ప ప్ర‌జ‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఏపీలో ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు.

ఏదేమైనా పార్టీ త‌ర‌పున జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పే నాయ‌కులు ఉండి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప‌రిస్థితి రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి అనే చందంగా మారింది. ఇదే ప‌రిస్థితి ఉంటే మ‌రో రెండు ట‌ర్మ్‌ల వ‌ర‌కు కూడా ఇక్క‌డ ఆ పార్టీ అధికారానికి దూరంగానే ఉంటుందన‌డంలో సందేహాలు అక్క‌ర్లేదు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English