జమ్మలమడుగులో టీడీపీ ఖాళీ అయినట్టేనా?

జమ్మలమడుగులో టీడీపీ ఖాళీ అయినట్టేనా?

చూస్తుంటే... కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ నిజంగానే ఖాళీ అయ్యే సూచనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి సోమవారం బీజేపీలో చేరిపోయారు. ఈ వార్త వెలువడిన కాసేపటికే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి... ఢిల్లీ పయనమైన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎయిర్ పోర్టులో కలిశారు. అంటే.. మంత్రిగా పదవి దక్కించుకుని ఆ తర్వాత పార్టీ ఓటమితో ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి జంప్ కొడితే... ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉన్న తనను టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదన్న వాదనతో రామసుబ్బారెడ్డి ఇప్పుడు జగన్ కు దగ్గరవుతున్నట్లుగా స్పష్టంగానే తెలుస్తోంది. వెరసి ఆది బీజేపీలోకి వెళితే... రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళితే... జమ్మలమడుగులో టీడీపీ ఖాళీ అయినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

2019 ఎన్నికలకు ముందు జమ్మలమడుగులో వైసీపీకి అసలు అభ్యర్థి దొరుకుతాడా? అన్న అనుమానాలు వినిపించాయి. 2014లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఈ చేరికను రామసుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కూడా పలుమార్లు రామసుబ్బారెడ్డితో భేటీ అయిన చంద్రబాబు... ఏళ్లుగా వైరి వర్గాలుగా కొనసాగుతున్న ఆది, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఓ రాజీ ఫార్మూలా కుదిర్చి... ఆదిని టీడీపీలోకి చేర్చుకుని ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. దానికి ప్రతిగా రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి రామసుబ్బారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి బరిలోకి దిగేలా అప్పుడే ఒప్పందం కుదిరింది. అయితే వారిద్దరూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు.

ఇక ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ అధికారం నుంచి దిగిపోతే... రీ సౌండింగ్ విక్టరీ కొట్టిన వైసీపీ కొత్తగా అధికార పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆదినారాయణరెడ్డి... బీజేపీలోకి చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలా రోజుల క్రితమే ఒప్పేసుకున్నారు. ఆ మేరకే ఆయన సోమవారం బీజేపీలో చేరిపోయారు. ఈ ఘటన జరిగిన రోజే... ఆశ్చర్యంగా జగన్ తో రామసుబ్బాడ్డి చేయి కలిపారు. ఢిల్లీ వెళ్లేందుకు పయనమైన తనను ఎయిర్ పోర్టులో పలకరించిన రామసుబ్బారెడ్డిని జగన్ ఆత్మీయంగానే పలకరించారు. దీంతో ఇప్పుడు రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరిపోవడం ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... జమ్మలమడుగులో టీడీపీ ఖాళీ అయిపోయినట్టే లెక్క.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English