వాళ్లంతా ఒక్కటయ్యారు... కేసీఆర్ కు బ్యాండ్ బాజానేనా?

 వాళ్లంతా ఒక్కటయ్యారు... కేసీఆర్ కు బ్యాండ్ బాజానేనా?

తెలుగు నేలలో ఇప్పుడంతా నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తోంది. టీ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో బైపోల్స్ అనివార్యంగా మారిన హుజూర్ నగర్ లో గులాబీ జెండా పాతేద్దామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలి వ్యూహాలకు పదును పెట్టారు.

అయితే కేసీఆర్ కు గట్టిగా బుద్ది చెప్పకపోతే తప్పదన్న భావనతో టీ కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపైకి రాగా... ఇప్పుడు కేసీఆర్ కే బ్యాండ్ బాజా తప్పదా? అన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. హుజూర్ నగర్ పై ఉత్తమ్ ఫ్యామిలీకి మంచి పట్టుందనే చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ఉత్తమ్ సతీమణే పోటీకి దిగారు.

అటు టీఆర్ఎస్ తరఫున వడబోతల మీద వడబోతలు చేసిన కేసీఆర్... ఎట్టకేలకు కాస్తంత గట్టి అభ్యర్థినే రంగంలోకి దింపారు. మరోవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ద్వారా సత్తా చాటుదామంటూ బీజేపీ కూడా పక్కా వ్యూహాలే రచించింది. స్థానికంగా మంచి పేరున్న అభ్యర్థిని కమలనాథులు రంగంలోకి దించారు.

ఇతర పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నా... కేసీఆర్ మార్కు వ్యూహాల ముందు తేలిపోతాయన్న వాదన బాగానేే వినిపిస్తున్నా... కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కనిపిస్తున్న ఐక్యతా రాగాన్ని చూస్తుంటే... కేసీఆర్ వ్యూహాలన్నీ తుత్తునీయలు కాక తప్పదేమోనన్న భావన కూడా అంతే బలంగా వినిపిస్తోంది. టీ పీసీసీ చీఫ్ గా చాలా కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఉత్తమ్... గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రబావం చూపలేకపోయారు.

హుజూర్ నగర్ లో తాను గెలిచినా... పార్టీ తరఫున హ్యాండ్ ఫుల్ గా అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఆయన విఫలమయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలో ఉత్తమ్ ను దించేసి ఆ పీఠాన్ని తమకు ఇవ్వాలని నల్లగొండ జిల్లాకే చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ అధిష్ఠానం వద్ద మంచి పలుకుబడి ఉన్న వి.హన్మంతరావు, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డిలు తమదైన శైలి యత్నాలు చేశారు. ఇప్పటిదాకా ఈ యత్నాలేవీ ఫలించకున్నా... ఈ యత్నాలు నేతల మధ్య దూరాన్ని పెంచాయి.

అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని ఇప్పుడు ఉత్తమ్ కు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు బాసటగా నిలిచారు. ఈ ముగ్గురూ కలిస్తే... ఇంకేముంది... దాదాపుగా పార్టీలోని అన్ని వర్గాలు ఒక్కదరికి చేరినట్టేనన్న వాదన వినిపిస్తోంది. ఓ వైపు ఉత్తమ్, మరోవైపు కోమటిరెడ్డి, ఇంకోవైపు నుంచి రేవంత్ రెడ్డి.. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

అసలే ఉత్తమ్ కు గట్టి పట్టున్న హుజూర్ నగర్ లో ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడం కష్టమేనన్న వాదన వినిపిస్తున్నా... ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరొందిన కేసీఆర్... హుజూర్ నగర్ పై ఓ రేంజిలో వ్యూహాలు రచించారు. అయితే ఆ వ్యూహాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తున్న ఐక్యతారాగం ముందు తుత్తునీయలు కాక తప్పదన్న వాదన అయితే బలంగానే వినిపిస్తోంది. ఇదే జరిగితే... కాంగ్రెస్ పార్టీ చేతిలో కేసీఆర్ బ్యాండ్ బాజానేనన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English