మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ ‘లాపతా లేడీస్’ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. థియేటర్లలో దాని బడ్జెట్ కి మించి వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. విడాకులు ఇచ్చినప్పటికీ నిర్మాణంలో భాగస్వామిగా కొనసాగుతున్న కిరణ్ రావుతో కలిసి ఆమె దర్శకత్వంలోనే అమీర్ ఖాన్ నిర్మించిన ఎంటర్ టైనరిది. సదరు ఓటిటి ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానంలో ఉండగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాంటి దేశాల్లో ఎగబడి చూస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద మిస్సయిన ఆడియన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది అసలీ లాపతా లేడీస్ ఒరిజినల్ కాదనేది తాజాగా రేగుతున్న వివాదం. వివరాల్లోకి వెళ్తే మ్యాటర్ అర్థమవుతుంది. 1998లో ‘గూంఘట్ కే పత్ కోల్’ అనే సినిమా వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు అమ్మాయిలు అనుకోని పరిస్థితుల్లో భర్తలుగా పొరపడి వేరొకరి ఇళ్లకు వెళ్తారు. మొహాలకు ముసుగులు ఉండటం వల్ల జరిగిన పొరపాటిది. లాపతా లేడీస్ లోనూ అచ్చం ఇదే పాయింట్ ఉంటుంది. కాకపోతే స్క్రీన్ ప్లే, కామెడీ, ట్రీట్ మెంట్ వేరుగా ఉంటాయి. థీమ్ అయితే ఒకటే.
విచిత్రంగా లాపతా లేడీస్ రిలీజైనప్పటి నుంచి యూట్యూబ్ లో ఉన్న గూంఘట్ కే పత్ కోల్ మాయమైపోయింది. విషయం తెలిసి అనంత్ మహదేవన్ షాక్ తిన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా తెలిసే తన కథను వాడుకున్నారనేది ఆయన వెర్షన్. దీని గురించి పలు సామజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ కాకతాళీయంగా జరిగితే తన సినిమా ఆన్ లైన్ నుంచి ఎందుకు తీసేశారనేది అనంత్ లాజిక్. దీని గురించి కిరణ్ రావు ఎలా స్పందిస్తారో కానీ మొత్తానికి కళ్ళముందు నిజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రొడ్యూసర్ గా అమీర్ ఏమంటాడో చూడాలి.