కేసీఆర్‌కు గ‌ట్టి షాక్‌.. ప్ర‌చారంపై నిషేధం

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భారీ షాక్ త‌గిలింది. కీల‌కమైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యం లో ఆయ‌న‌ను ప్ర‌చారం నుంచి నిషేధం విధిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఇచ్చిన ఆదేశాల మేర‌కు కేసీఆర్‌.. రెండు రోజుల పాటు ప్ర‌చారానికి దూరంగా ఉండాల్సిందేన‌ని ఈసీ పేర్కొంది. బుధ‌వారం రాత్రి 8 గంట‌ల నుంచి త‌మ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. అప్ప‌టి నుంచి శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఎలాంటి ప్ర‌చారానికి ఆయ‌న వెళ్ల‌కూడ‌ద‌ని కూడా ఈసీ త‌న ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

అంతేకాదు.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా దూరంగా ఉండాల‌ని.. టెలీ కాన్ఫ‌రెన్స్ స‌హా టీవీలు, సెల్పీ వీడియోలు.. ఇత‌ర‌త్రా మాధ్య‌మాల్లో దేనినీ వినియోగించుకుని ప్ర‌చారం చేయ‌డానికి వీల్లేద‌ని.. పేర్కొంది. అయితే.. పార్టీ ఆఫీసుకు మాత్రం వెళ్ల‌వ‌చ్చ‌ని తెలిపింది. కానీ, ఈ సంద‌ర్భంగా కూడా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసేలా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డానికి వీల్లేద‌ని ఈసీ తేల్చి చెప్పింది. తాము ఇచ్చిన ఆదేశాలు రెండు రోజుల వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపింది. ఈ ఆదేశాల‌ను విస్మ‌రించి.. ప్రచారం చేస్తే.. త‌దుప‌రి క‌ఠిన నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ఈసీ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్యంగా సిరిసిల్ల‌లో గ‌త వారం జ‌రిగిన ప్ర‌చారంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. ప్ర‌జ‌ల ర‌క్తం తాగుతున్నార‌ని అన్నారు. అదేవిదంగా రేవంత్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. వీటిపై రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు  కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో తాజాగా కేసీఆర్ ప్ర‌చారంపై నిషేధం విధించారు.