ఇంకో ఐదేళ్ల వ‌రకు జ‌గ‌న్ సేఫ్‌…! 

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు ఏమీ జ‌ర‌గ‌దు. ఆయ‌న ప్ర‌శాంతంగా.. సాఫీగా త‌న ప‌ని తాను చేసుకు ని పోవ‌చ్చు. అదేంటి? అనుకుంటున్నారా? ఇది రాజ‌కీయాల గురించి కాదు.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి గురించి కూడా కాదు. దీని గురించి ప్ర‌జ‌లు చూసుకుంటారు. జూన్ 4న తీర్పు వెల్ల‌డ‌వుతుంది. అయితే.. దీనికి మించిన వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ సేఫ్‌తోపాటు.. సేవ్ కూడా అయ్యారు. దాదాపు ఐదేళ్ల పాటు.. ఆయ‌న కుశ‌లంగా ఉండ‌నున్నారు. చీకు చింతా కూడా లేకుండా గ‌డ‌ప‌నున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. 2011-12 మ‌ధ్య కాలంలో ప్ర‌స్తుతం సీఎం స్థానంలో జ‌గ‌న్‌పై అక్ర‌మ ఆస్తుల కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసుల‌కు సంబంధించి ఆయ‌న 16 నెల‌లు జైల్లో కూడా గ‌డిపి వ‌చ్చారు. అయితే.. ఈ కేసులు ఒక‌టి రెండు కావు. ఏకంగా 33 చార్జిషీట్లు దాఖ‌లు చేసిన కేసులు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్ర‌మంగా సంస్థ‌ల‌ను ఏర్పాటు చేశార‌నేది అభియోగం.

అంటే.. `ఎక్స్‌` అనే వ్య‌క్తికి వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు.. రూ.1000 ల‌బ్ధి చేకూర్చాడ‌ని అనుకుంటే.. ఈ ఎక్స్ అనే వ్య‌క్తి.. ఓ 100 రూపాయ‌లు జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టాడు. ఇదీ.. ఇత‌మిత్థంగా సీబీఐ పేర్కొన్న కేసు. ఇలానే.. 33 చార్జిషీట్లు దాఖ‌ల‌య్యాయి. హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచార‌ణ సాగింది. దాదాపు 12 ఏళ్లుగా.. ఈ కేసుల విచార‌ణ‌ను కొన‌సాగించారు. ఇక‌, మంగ‌ళ‌వారం(ఏప్రిల్ 30) తుది తీర్పు రావాల్సి ఉంది. ఎందుకంటే.. ఈడీ, సీబీఐ కూడా.. త‌మ వాద‌న‌లు పూర్తి చేశాయి. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు.. ఏం జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూశారు.

కానీ, ఇక్క‌డే అనూహ్య‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. ఈ కేసుల‌ను సుదీర్ఘంగా 12 ఏళ్ల నుంచి వింటున్న సీబీఐ కోర్టు జ‌డ్జి ర‌మేష్‌బాబు.. బ‌దిలీ అయిపోయారు. ఆయ‌న‌ను వేరే కోర్టుకు బ‌దిలీ చేస్తూ.. కొన్నాళ్ల కింద‌టే ఉత్త‌ర్వులు ఇచ్చారు. అయితే.. ఇక్క‌డ ఒక కండిష‌న్ పెట్టారు. ఏప్రిల్ 30 నాటికి ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని జ‌డ్జి ర‌మేష్‌బాబుకు హైకోర్టు, సుప్రీంకోర్టులు గ‌డువు పెట్టాయి. సో.. ఏప్రిల్ 30 అంటే మంగ‌ళ‌వారం ఏదో ఒక‌టి తేలిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ఇక్క‌డే కీలక మ‌లుపు తిరిగింది. జ‌డ్జి ర‌మేష్‌బాబు… ఎలాంటి తీర్పు ఇవ్వ‌లేదు. కానీ, విచార‌ణ‌లు మాత్రం విన్నాన‌ని.. వాద‌న‌లు పూర్త‌య్యాయ‌ని పేర్కొన్నారు. అయితే.. తీర్పు రాసేందుకు త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌లేద‌ని.. కాబ‌ట్టి త‌దుప‌రివ చ్చే న్యాయ‌మూరి చూసుకుంటార‌ని తేల్చి చెప్పారు. అయితే.. త‌దుప‌రి వ‌చ్చే న్యాయ‌మూర్తి వెంట‌నే తీర్పు ఇచ్చేస్తార‌ని అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే.. మ‌ళ్లీ ఆయ‌న కూడా.. మొద‌టి నుంచి ఈ కేసును వినాల‌ని.. అప్ప‌టి వ‌ర‌కు తీర్పు చెప్ప‌రు. అంటే.. సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇది తేల‌డానికి.. అంటే.. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన‌డానికి క‌నీసంలో క‌నీసం 5 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది. అప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ సేవు, సేఫు.. అన్న‌మాట‌. అయితే… ఈ విషయంలో ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతే అపుడు అంతా మారిపోవచ్చు.

+  కొస‌మెరుపు ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వాద‌న‌ల‌కు అయిన ఖ‌ర్చు మొత్తం.. అటు ప్ర‌భుత్వం, ఇటు జ‌గ‌న్ పెట్టిన ఖ‌ర్చు కూడా వృధా.