కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగం సభలో చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేస్తూ.. విడుదల చేసిన వీడియోలో తన ప్రమేయం లేదని.. తనకు, ఆ వీడియోకుఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన కేంద్ర హోంశాఖ, సహా ఢిల్లీ పోలీసులకు ఆయన లేఖ రాశారు. ఈ లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది కేంద్ర పోలీసులకు అందించారు.
ఇదీ లేఖ సారాంశం
నాకు అందించిన సమన్లకు సంబంధించి నేను రాలేక పోతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భౌతికంగా హాజరు కాలేక పోతున్నాను. అయితే.. మీరు(ఢిల్లీ పోలీసులు) పేర్కొన్నట్టుగా కేంద్ర మంత్రి అమిత్ షా మార్పింగ్ వీడియోతో నాకు సంబంధం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. నేను కాంగ్రెస్ పార్టీఅధికారిక `ఎక్స్` ను వినియోగించడం లేదు. ముఖ్య మంత్రి కార్యాలయం పేరుతో ఉన్న ఖాతాను, అదేవిధంగా రేవంత్‌రెడ్డి పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ రెండు ఖాతాలను ఇప్పటి వరకు దుర్వినియోగ పరచలేదు కనుక అమిత్ షా వ్యాఖ్యలతో కూడిన వీడియో మార్పింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. – అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఏం జరిగింది?
సిద్దిపేట సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. భారత రాజ్యాంగంలో మత పరమైన రిజర్వేషన్లను ఇచ్చే ప్రతిపాదన కానీ.. ఆర్టికల్ కానీ లేదని.. దీనిని రాజకీయ దురుద్దేశంతో మాత్రమే తీసుకువచ్చారని పేర్కొన్నారు. ముస్లింలకు మైనారిటీ కులాలకు కేటాయించిన రిజర్వేషన్లను రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంచుతామని చెప్పారు.
అయితే.. అమిత్ షా చేసిన ఈవ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన కొందరు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా వీడియో సృష్టించారు. ఇది భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పలు రాష్ట్రాల్లో కేసులు పెట్టారు. దీనిపై స్పంందించిన కేంద్ర హోం శాఖ.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ విభాగం తెలంగాణ ఇంచార్జ్‌కి కూడా సమన్లు జారీ చేశారు. సోమవారం హాజరు కావాలని కోరారు. అయితే.. రెండు రోజుల తర్వాత.. రేవంత్ రెడ్డి ఈ లేఖను పంపించారు. మరి కేంద్ర హోం శాఖ, పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.