ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ, కూటమి పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్న కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్.. కూటమి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయ భేరి సభలో జగన్ పై పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజల ఆస్తి పత్రాలపై జగన్ కు ఉన్న హక్కు ఏంటి? పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు వేసుకున్నారు అని పవన్ నిలదీశారు.
ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వైసీపీ అమలు చేస్తోందని, వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని జోస్యం చెప్పారు. భారత పాస్ పోర్టుపై ప్రధాని మోడీ ఫొటో ఉండదని, కానీ, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలని పవన్ స్పష్టం చేశారు.
జగన్ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతోనే ఆ మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. తన బలమైన ఆకాంక్ష అని అన్నారు. గత పదేళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేసినా, ఎన్నో మాటలన్నా ప్రజల కోసం భరించానని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా పడతానని పవన్ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, ప్రజలే గెలవాలని ఆకాంక్షించారు. వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి జగన్ పొలిటికల్ హాలిడే ప్రకటించాల్సిందేనని సెటైర్లు వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates