మళ్లీ హిందువులను అవమానించేలా కామెంట్లు చేసిన కేసీఆర్

మళ్లీ హిందువులను అవమానించేలా కామెంట్లు చేసిన కేసీఆర్

మొన్నటి పార్లమెంటు ఎన్నికల సమయంలో ‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనా ప్రభావం చూపించాయని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో నాలుగిటిని బీజేపీ గెలుచుకోగా.. 17లో ఒకటి తన మిత్రుడు అసదుద్దీన్‌కు పోగా మిగతా పదహారూ తామే గెలుస్తామని విర్రవీగిన కేసీఆర్ అందులో సగంతోనే సరిపెట్టుకున్నారు.

హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూసిన కేసీఆర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయడం కలకలం రేపుతోంది. ఆదివారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ... కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలు ఎక్కువని అనడం వివాదాస్పదమవుతోంది. నామాలు పెట్టుకోవడమనేది హిందూ సంస్కృతిలోనే ఉండడంతో ఆయన హిందువులను అవమానించేలా మాట్లాడారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

సెప్టెంబరు 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినంపై సీఎం కేసీఆర్‌  ఆదివారం శాసనసభలో ప్రస్తావించారు. ఆ సందర్భంగా ఆయన ‘‘కొత్తగా మతం పుచ్చుకున్నొడికి నామాలు ఎక్కువ’’ అన్నారు. ఇది బీజేపీని ఉద్దేశించిన చేసిన కామెంటే అయినా ఆయన మొత్తంగా హిందువులను అవమానించారన్న విమర్శలు వస్తున్నాయి.

హిందువుల్లో వైష్ణవులైనా, శైవులైనా నామాలు పెట్టుకోవడమనేది చాలామందిలో ఉండే ఆచారం. వైష్ణవాచారాలు పాటించేవారు నిడువు నామాలు పెడితే శైవాచారాలు పాటించేవారు అడ్డంగా నామాలు పెట్టుకుంటారు. హిందువులు కాకుండా ఇతర మతాల్లో నామాలు, బొట్లు పెట్టుకునే ఆచారం లేదు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలు నేరుగా హిందువులకే తాకుతున్నాయి.

పైగా.. మతం పుచ్చుకోవడం అనే మాటపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర మతాల నుంచి హిందూత్వలోకి కన్వర్షన్లు జరగడం లేదని.. హిందువులనే ఇతర మతాలవారు ఆకర్షించి కన్వర్ట్ చేస్తున్నారని.. అలాంటప్పుడు హిందూమతంలోకి కన్వర్షన్లు జరుగుతున్నాయన్నట్లుగా కేసీఆర్ ‘కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి...’ అంటూ వ్యాఖ్యానించడం సబబు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చినజీయర్, స్వరూపానందేంద్ర స్వామి వంటవారిని తరచూ కలుస్తూ.. తరచూ హోమాలు, యాగాలు చేయిస్తూ... గుళ్లుగోపురాలు తిరుగుతూ హడావుడి చేసే కేసీఆర్ మరి హిందువులు, హిందూత్వను అవమానించేలా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. బీజేపీ ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికే ఆయన యాగాల నిర్వహణ, ఆలయ సందర్శన, స్వామీజీలతో సమావేశాలు వంటివాటితో నటిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English