సీఎం జగన్‌పై ఆయన సోదరి షర్మిల.. ఎన్నికల ప్రచారాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హీటెక్కించిన విషయం తెలిసిందే. అన్నను టార్గెట్ చేస్తూ.. గడిచిన నెల రోజులకు పైగానే ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలను జగనే దూరం చేసుకున్నారని.. రాజకీయంగా ఆమె సేవలు వినియోగించుకుని.. దూరం పెట్టారని చెప్పారు. అయినా.. షర్మిల ఎప్పుడూ బాధపడలేదన్నారు. కానీ, ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. తన ఆలోచనను మార్చుకున్నట్టు చెప్పారు.
“షర్మిలకు సొంతగా పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు. కానీ, ప్రశాంత్ కిశోర్.. పదేపదే రావడం.. ఆమెకు గైడ్ చేయడంతోనే పార్టీ పెట్టారు” అని బ్రదర్ అనిల్ చెప్పారు. సీఎం జగన్ అంటే.. షర్మిలకు అభిమానమేనని చెప్పారు. సీఎంగా చూడాలని తపించా ని.. అందుకే ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ ని ముందుండి నడిపించారని తెలిపారు. కానీ, జగన్.. షర్మిలను నిర్లక్ష్యం చేయడంతో ఆమె బెంగళూరులోనే ఉండిపోయారని చెప్పారు. ఈ సమయంలో ప్రశాంత్ కిశోర్ వచ్చి పార్టీ పెట్టమన్నప్పుడు కూడా.. జగన్ అభిప్రాయం తీసుకోవాలని చెప్పారన్నారు. పార్టీ పెట్టేందుకు జగన్ ఒప్పుకోలేదని తెలిసి.. మౌనంగా ఉండిపోయారని తెలిపారు.
కానీ, ప్రశాంత్ కిశోర్ మాత్రం షర్మిలను ఒత్తిడి చేసి.. తెలంగాణ ప్రజలు ఆమెను కోరుకుంటున్నట్టు చెప్పారన్నారు. జగన్ కూడా.. తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేస్తే బాగుంటుందని గతంలో చెప్పిన నేపథ్యంలో ఏపీకి కాకుండా.. తెలంగాణకు షిఫ్ట్ అయ్యా రని బ్రడర్ తెలిపారు. కేసీఆర్ ఓటమిని కాంక్షించే తెలంగాణలో పార్టీ పోటీ చేయలేదన్నారు. తాను ఎప్పుడూ షర్మిల రాజకీయా ల్లో జోక్యం చేసుకోలేదని అనిల్ కుమార్ వెల్లడించారు. తన పోరాటం తనే చేసుకుందన్నారు. రాజకీయాల్లో షర్మిలకు సక్సెస్ వస్తుందనే ఆశ తనకు ఉందన్నారు.
అయితే.. ఇప్పటి వరకు పోరాటాలతోనే తాను గడుపుతున్నారని.. ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారని తెలిపారు. భవిష్యత్తులో షర్మిలకు అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణలో ఆమె పెట్టిన పార్టీలో చేరిన వారంతా షర్మిలను అర్ధం చేసుకోలేకపోయారని బ్రదర్ అనిల్ వెల్లడించారు. తన వెంట నడిచిన వారిని వదిలేశారనడం సరికాదన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె మాట్లాడారని.. కానీ, కొందరు తొందరపడి ఆమెను విమర్శించారని తెలిపారు. మంచి ఎప్పుడూ గెలుస్తుందని బ్రదర్ చెప్పారు.