ప‌దునైన ఆయుధంతో బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ కూట‌మికి ఓ ప్ర‌ధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యాన్నే ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వైసీపీని దెబ్బ కొడుతున్నారు. ఆ ఆయుధం పేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌. ఎన్నిక‌ల ప్ర‌చార చివ‌రి ద‌శ‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ చ‌ట్టంతో భూముల‌న్నీ జ‌గ‌న్ చేతిలోకి వెళ్లిపోతాయ‌ని, జ‌నాల‌కు హ‌క్కు ఉండ‌ద‌ని బాబు బ‌లంగా వాద‌న వినిపిస్తున్నారు. ఈ విష‌యాన్ని జనాల్లోకి బ‌లంగా తీసుకెళ్తున్నారు.

ఇప్పుడు ఇత‌ర హామీలు, మేనిఫెస్టో ఇలా ఇత‌ర అంశాల‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి ప్ర‌ధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే బాబు మాట్లాడుతున్నారు. ఎక్క‌డైనా అదే మ్యాట‌ర్‌. భూముల‌న్నింటినీ మింగేసేందుకు చ‌ట్టం పేరుతో జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యార‌ని బాబు ఆరోపిస్తున్నారు. ఇంట‌ర్వ్యూల్లో, ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లో ఇదే ప్రధానంగా క‌నిపిస్తోంది. దీంతో జ‌నాలు కూడా ఈ విష‌యంపై చ‌ర్చిస్తున్నారు. త‌మ భూములను ఎలా వ‌దులుకుంటామ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపేదే లేదంటూ తీర్మానిస్తున్నారు.

ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో నెగెటివ్ ఎఫెక్ట్ ఊహించ‌ని స్థాయిలో వైసీపీని క‌మ్మేస్తోంది. అందుకే కౌంట‌ర్ ఇచ్చేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తున్నా జ‌గ‌న్ త‌ప్ప దీని గురించి వైసీపీలో మాట్లాడేవాళ్లే లేకుండా పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. ప్ర‌జ‌ల భూములు వాళ్ల పేర్ల‌తోనే ఉంటాయ‌ని వివర‌ణ ఇస్తున్నారు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో జీరాక్స్ కాపీలు కాదు ఒరిజిన‌ల్ పేప‌ర్సే ఇస్తున్నామ‌ని కూడా చెబుతున్నారు. కానీ మ‌రే వైసీసీ నేత కూడా దీనిపై మాట్లాడ‌టం లేదు. దీంతో జ‌నాల‌కు క్లారిటీ రావ‌డం లేదనే టాక్ ఉంది. జ‌గ‌న్ ఎంత చెప్పినా జ‌నాలు విన‌డం లేద‌ని అంటున్నారు.