సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ‌లో ఏం జ‌ర‌గ‌బోతోంది..!

సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ‌లో ఏం జ‌ర‌గ‌బోతోంది..!

తెలంగాణ రాజ‌కీయాల్లో కొద్ది రోజులుగా ఓ విష‌యం హాట్‌టాపిక్‌గా మారింది. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దుగానీ.. ప్ర‌చారం మాత్రంతో జోరుగా జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ 17వ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌కొద్దీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆ విష‌యంపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే.. ఇంత‌కీ ఆ ముచ్చ‌ట ఏమిట‌ని అనుకుంటున్నారా..?  సెప్టెంబ‌ర్ 17కు, ఆ ముచ్చ‌ట‌కు ఏమిటి సంబంధం అని ఆలోచిస్తున్నారా..?  ఇక సూటిగా విష‌యానికి వ‌చ్చేద్దాం.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయ‌ ప‌రిణామాలు అత్యంత ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఇందులో సెప్టెంబ‌ర్ 17న ఊహ‌కంద‌ని ప‌రిణామాలు ఉంటాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

సెప్టెంబ‌ర్ 17ను కొంద‌రు విలీన‌మ‌ని అంటే.. మ‌రికొంద‌రు విద్రోహమ‌ని, ఇంకొంద‌రు విముక్తి అంటుంటారు. ఇది చాలా ఏళ్లుగా న‌లుగుతున్న విష‌య‌కానీ.. ఇప్పుడు ఇదే అంశాన్ని బీజేపీ స‌రికొత్త అస్త్రంగా టీఆర్ఎస్‌పై ప్ర‌యోగించ‌బోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈరోజున బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు.

అయితే.. ఆ రోజు తెలంగాణ రాజ‌కీయాల్లో ఏదో కీల‌క మ‌లుపు జ‌ర‌గ‌బోతోంద‌ని, అధికార టీఆర్ఎస్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతాయంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచితీరాల‌న్న క‌సితో క‌మ‌ల‌ద‌ళం వ్యూహాత్మ‌కంగా దూసుకొస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత అదే ఉత్సాహంతో మ‌రింత దూకుడుగా ఉంటోంది.

ఇక ఇదే స‌మ‌యంలో అధికార టీఆర్ఎస్ పై తీవ్ర‌స్థాయిలో రాష్ట్ర బీజేపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. మ‌రోవైపు ఆప‌రేష‌న్ ఆకర్శ్ చేప‌ట్టి కాంగ్రెస్‌, టీడీపీతోపాటు అధికార టీఆర్ఎస్ నుంచి కీల‌క నేత‌ల‌ను లాగుతున్నారు. అయితే.. ఇక్క‌డ మ‌రో కీల‌కం అంశం ఒక‌టి ఉంది. ఈమ‌ధ్య గులాబీద‌ళంలో ధిక్కార స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఈ ధిక్కార‌గ‌ళాల ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది ఎవ్వ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు.

సెప్టెంబ‌ర్ 17వ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలో ధిక్కార నేత‌ల సంఖ్య పెరుగుతోంది. మొన్న‌టికి మొన్న మంత్రి ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ప‌ద‌వి ఎవ‌రి భిక్ష‌కాద‌ని, గులాబీ జెండా ఓన‌ర్ల‌లో ఒక‌డిన‌ని సూటిగా చెప్పేశారు.

ఇక ఆ కొన‌సాగింపుగానే మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ కూడా గురుపూజోత్స‌వం నాడు ఉపాధ్యాయుల స‌మ‌క్షంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాఠ‌శాల‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డులు పోయి తెలంగాణ బోర్డులు వ‌చ్చాయి త‌ప్ప ఏమీ మార‌లేదంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇక మ‌రికొంద‌రు నేత‌లు సైలెంట్‌గా ఉంటూ పార్టీ అధిష్టానంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ జాబితాలో చాలామందే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. సెప్టెంబ‌ర్ 17న వీరంద‌రూ ఏదో కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప్ర‌చారం ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. ఆరోజు వ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English