బాబు బయలుదేరారు.. మరింత రచ్చ ఖాయం

బాబు బయలుదేరారు.. మరింత రచ్చ ఖాయం

ఏపీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. విపక్ష నేత హైదరాబాద్ లో ఉన్నారు. ఇలాంటి వేళ.. ఏపీకి ఇతర రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా వెల్లువెత్తుతున్న వదర నీరుతో వరద ముంపు ప్రాంతాలు నీళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇలాంటివేళ.. అధికారులు పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇదే సమయంలో బాబు నివాసంపైన డ్రోన్ ఎగిరిన వైనంపై తెలుగు తమ్ముళ్లు రచ్చ చేయటం మినహా చేసిందేమీ లేదు. ఎంతసేపటికి తమ బాస్ సెక్యురిటీ గురించి తప్పించి ప్రజల గురించి.. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టం గురించి పెద్దగా పట్టిన విపక్ష నేతలు ఎవరికి వారుగా ఉన్నారు.

డ్రోన్ వ్యవహారంపై  పెద్ద ఎత్తున రాజకీయ హడావుడి చేసిన తెలుగు తమ్ముళ్లకు తగ్గట్లే జగన్ పార్టీ నేతలు సైతం.. ఆ అంశానికి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇదిలా ఉంటే వరద నీటి కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్న పరిస్థితి. వారి వెతల్ని తీర్చేందుకు అధికారపక్షం ఎఫెక్టివ్ గా పని చేయటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఇలాంటి పరిస్థితుల్లో పర్యటించటం ద్వారా మైలేజీని మూటగట్టుకోవాలన్న ఆలోచనతో హైదరాబాద్ నుంచి తాజాగా బయలుదేరి వెళ్లారు.

వరద ముంపు కారణంగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవటం.. పెద్ద ఎత్తున వరద నీటిని దిగువనకు విడిచిపెట్టటంతో వరద ముంపు ప్రాంతాలన్ని ఇప్పుడు నీటితో నిండుతున్నాయి. దీంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీటిని ఇటీవల విడుదల చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో.. కృష్ణా జిల్లాలో 46గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలాకష్టంలో ఉన్న వారిని పరామర్శించటం ద్వారా తనకు.. ముఖ్యమంత్రికి మధ్యనున్న వ్యత్యాసాన్ని చూపించాలన్నదే చంద్రబాబు లక్ష్యమంటున్నారు. మరి.. బాబు తాజా టూర్ తో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కటం ఖాయం. పరామర్శ పేరుతో బాబు చేసే వ్యాఖ్యలతో జగన్ పార్టీ నేతలకు మరింత పని కల్పించేలా చేస్తుందనటంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English