పోలవరంలో అక్రమాల్లేవట... సీబీఐ దర్యాప్తూ లేదట

పోలవరంలో అక్రమాల్లేవట... సీబీఐ దర్యాప్తూ లేదట

ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని చాలా కాలం నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే... పోలవరం అవినీతిపై దర్యాప్తు జరుపుతామని, టీడీపీ నేతలు మెక్కిన నిధులన్నీ కక్కిస్తామని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో చెప్పిన సంగతి తెలిసిందే. నాడు టీడీపీతో బీజేపీ పొత్తులో ఉన్నా కూడా... పోలవరం నిధుల వినియోగానికి సంబంధించి వివరాలు ఇవ్వడం లేదని, అందుకే కొత్తగా నిధులు విడుదల చేయడం లేదని బీజేపీ నేతలు, కేంద్రంలోని మోదీ సర్కారులోని మంత్రులు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పిన మాట మేరకు జగన్ పోలవరం అక్రమాలపై విచారణకు సిద్దంగా ఉన్నా... బీజేపీ సర్కారు మాత్రం దీనిపై వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ దిశగా పార్లమెంటు వేదికగా పోలవరం అక్రమాలపై సీబీఐ విచారణ లేదంటూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ అంశం ఇప్పుడు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఆసక్తికర చర్చకు తెర లేసింది. సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పోలవరం అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సాయిరెడ్డి ఏఏ ప్రశ్నలు సంధించారన్న విషయానికి వస్తే... ‘పోలవరం అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించే ఆలోచన ఉందా? పోలవరం నిర్మాణానికి ఆర్థిక శాఖ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుంది? నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా... రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముంది? ఎస్టిమేట్స్ కమిటీ ఎప్పుడు ఆమోదం తెలుపుతుం?’ అని సాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. అందువల్ల సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని... వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని తెలిపారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు చెప్పినా కూడా దానిపై విచారణ చేయించే ఉద్దేశం తమకు లేదని కేంద్రం తేల్చి చెప్పినట్టైంది. మరి ఈ అక్రమాలపై జగన్ సర్కారు ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English