చంద్రబాబుకు జగన్ పెట్టిన డెడ్‌లైన్ వారం రోజులే..

చంద్రబాబుకు జగన్ పెట్టిన డెడ్‌లైన్ వారం రోజులే..

ప్రజావేదిక కూల్చివేత పూర్తవగానే జగన్ ప్రభుత్వం చంద్రబాబు ఇంటి కూల్చివేత కోసం చర్యల వేగం పెంచింది. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌కు అధికారులు నోటీసులు అతికించారు.  సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ నరేందర్ రెడ్డి.. ఉదయమే చంద్రబాబు ఇంటికి వచ్చి.. నోటీసులు అందించారు. వారం గడువు ఇచ్చారు. వారంలోగా ఇంటిని కూల్చివేయకపోతే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు.

అక్కడ అద్దెకు ఉంటున్న  చంద్రబాబుతో పాటు.. యజమాని అయిన లింగమనేని రమేష్‌కు కూడా ఇచ్చినట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. లింగమనేని ఎస్టేట్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహించే… లింగమనేని రమేష్ 2007లో  ఇక్కడ అతిథిగృహాన్ని నిర్మించుకున్నారు. అప్పట్లో అంటే 2007లో భవనానికి పంచాయతీ అనుమతి తీసుకున్నారు. 2009లో రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ నుంచి కూడా మినహాయింపు పొందారు. అయితే.. ఇప్పుడు సీఆర్‌డీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌2012, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్‌ సిటీ జోనింగ్‌ రెగ్యులేషన్‌ 2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్‌డీఏ గుర్తించడంతో నోటీసులిచ్చారు.

నోటీసులపై వారం రోజుల్లో స్పందించి నిర్మాణాలను తొలగించాలని లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.  మొత్తంగా కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నేడు, రేపు నోటీసులు అందజేయనున్నారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దెదారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనలకు అనుగుణంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ 50 అక్రమ కట్టడాల్లో మాజీ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్,  గణపతి సచ్చిదానంద ఆశ్రమం వంటివీ ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English