ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతున్న సమయంలో గత ఏడాది జగన్ సర్కారు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇది అత్యంత ప్రమాదకర చట్టమని.. దీని వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ యాక్ట్ గురించి పెద్ద చర్చ జరుగుతుండడంతో జగన్ సర్కారు మెడకు ఈ చట్టం చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. ఇలాంటి సమయంలో స్వయంగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ చట్టం వల్ల తాను కూడా బాధితుడిగా మారానని పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
”నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. IAS అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం” అని పీవీ రమేష్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
ఒక ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితితేంటి అంటూ నెటిజన్లు ఈ పోస్టును షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్వీట్‌పై ఎదురుదాడి చేస్తున్న వైసీపీ వాళ్లకు పీవీ రమేష్ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.