ఫొటోల పిచ్చి అనండి.. ప్రచార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చేజేతులా చేసుకున్న వ్యవహారం ఇప్పుడు పీకల వరకు తెచ్చింది. సీఎం జగన్‌కు ఎవరు సలహా ఇచ్చారో.. ఏం చెప్పారో తెలియదు కానీ.. ఆయన ఏం చేసినా.. ఫొటోలు వేసుకోవడం రివాజు. ఇంటి డోర్ నుంచి.. పిల్లలకు ఇచ్చే పుస్తకాల వరకు, మహిళలకు ఇచ్చే పథకాల నుంచి పింఛను పుస్తకాల వరకు.. అన్నింటిపైనా సీఎం జగన్ బొమ్మ ఉండి తీరాల్సిందే అన్న పంథాను పాటించారు.
చివరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వేకు సంబంధించి కొనుగోలు చేసిన సరిహద్దు రాళ్ల పై కూడా.. జగన్ చిత్తరువులను చెక్కించారు. ఈ పరిణామంతో తమకు మేలు జరుగుతుందని… తెల్లారిలేస్తే.. ప్రతి ఒక్కరికీ కళ్లముందు ‘జగన్’ కనిపిస్తారని.. దీంతో వరుసగా రెండో సారి కూడా అధికారంలోకి వచ్చేయొచ్చ ని పార్టీ ఆశించింది. సలహా ఎవరిదైనా మరి ఆలోచన చేయాల్సిన సీఎం జగన్.. వారికి జై కొట్టారు. ఇంటింటా తన బొమ్మ ఉండేలా వ్యవహరించారు.
ఫలితంగా ఇప్పుడు పీకల వరకు వచ్చింది. ఏకంగా ఆస్తి పత్రాలపైనే తన ఫొటో వేసుకున్న తీరును.. ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. దీంతో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక చేతులు ముడుచుకోవాల్సిన పరిస్థితి వైసీపీ శిబిరం వంతైంది. “మీ ఆస్తులు దోచేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మీ ఆస్తులపై మీ ఫొటోలు కాకుండా.. జగన్ ఫొటోలు వేసుకున్నాడంటే అర్థం ఇదే” అని చంద్రబాబు సహా కూటమి శిబిరం నాయకులు చేస్తున్న ప్రచారం.. వైసీపీకి దడ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ వాదన.. మీ బిడ్డ అనే వాదనలు కూడా పక్కకు జరిగిపోయి.. ఫొటోల రాజకీయం వీరంగం వేస్తోంది. చివరకు మీ బిడ్డ అన్న జగన్ ఊతపదాన్ని కూడా వాడుకుని మీ బిడ్డ కాబట్టి మీ ఆస్తి తీసుకుంటాడు అంటూ అందులో తప్పేముందంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా.. ప్రజల ఆస్తి పత్రాలు, పట్టా(జగనన్న ఇళ్ల పథకంలో)లపైనా సీఎం జగన్ బొమ్మలు వేసుకున్న తీరును ప్రతిపక్షాలు లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. తీసుకువెళ్తున్నాయి. సహజంగానే ప్రజలకు ఆస్తితో ఎనలేని బంధం ఏర్పడుతోంది. ఈ విషయంలో చిన్న తేడా వచ్చినా.. క్రైమ్‌కు కూడా దారితీస్తున్న పరిస్థితి కళ్లకు కడుతోంది. అలాంటిది ఇప్పుడు జగనే తమ భూములు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్న ప్రతిపక్షాల మాటలను వారు విశ్వసించే పరిస్థితి వచ్చింది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తాను కూడా బాధితుడినే అనడంత ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో జగన్ తన కోసం చేసుకున్న పబ్లిసిటీయే ఆయన కొంపముంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తరతరాలుగా ఆస్తిపత్రాలపై ఏ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోలేదు. ఎప్పట్నుంచో గవర్నమెంట్ లోగో మాత్రమే ఉండేది. జగన్ వచ్చాక కొత్త చట్టం తెచ్చి జగన్ ఫొటో వేయడంతో ప్రభుత్వం కూలే పరిస్థితి వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates