కలిసిపోతే ఓ పనైపోతుంది కదా ?

ఇపుడిదే అంశంపై రాజకీయ పార్టీల్లో చర్చ జోరుగా సాగుతోంది. తొందరలో జరగబోయే 12 మున్సిపాలిటీలు, కొన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు పంచాయితీలు, వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తులు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిజానికి ఈ మధ్యనే స్ధానిక సంస్ధల ఎన్నికలు అయిపోయాయి.

అయితే అప్పట్లో ఎన్నికలు జరగని వాటికి వివిధ కారణాలతో బై ఎలక్షన్ అవసరమైన వాటికి ఇపుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పట్లో జరిగిపోయిన ఎన్నికల్లో 8 జిల్లాల్లో కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ-జనసేనలు కలిసిపోయాయి. నిజానికి విడివిడిగా చూస్తే పై రెండు పార్టీలు సాధించిన ఎంపీటీసీ స్ధానాల కన్నా వైసీపీ సాధించిన స్ధానాలే ఎక్కువ. అయితే వైసీపీని దెబ్బకొట్టడమే టార్గెట్ గా టీడీపీ, జనసేనలు కలిశాయి. దాంతో ఎంపీపీ అధ్యక్ష పదవులను కొన్నిచోట్ల టీడీపీ మరికొన్ని చోట్ల జనసేనలు పంచుకున్నాయి.

నిజానికి పై రెండు పార్టీల మధ్య పొత్తులు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వైసీపీని దెబ్బకొట్టాలన్న టార్గెట్ తోనే రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. రాజకీయాల్లో ఇదంతా మామూలే కావటంతో ఈ విషయం పెద్దగా ఆశ్చర్యమేమీ కాదు. ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజాగా మాట్లాడుతూ కిందిస్థాయి క్యాడర్ టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకోవాలని బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

చింతకాయల మాటలు వింటే విచిత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే రెండు పార్టీల మధ్య పొత్తులు నిర్ణయించేది సీనియర్ నేతలు+పార్టీల అధినేతలే. కిందిస్థాయి క్యాడర్ కేవలం పై స్ధాయి నిర్ణయాలను అనుసరిస్తాయంతే. కానీ ఇక్కడ చింతకాయల రివర్సులో మాట్లాడుతున్నారు. క్యాడర్ రెండు పార్టీల పొత్తులను గట్టిగా కోరుకుంటే పై స్థాయిలో అంగీకరించేస్తారా ? లేకపోతే క్యాడర్ బలంగా కోరుకుంటున్నారు కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటిస్తారా ?

వచ్చే ఎన్నికలనాటికి రెండుపార్టీలు పొత్తు పెట్టుకుంటాయని బలమైన ప్రచారం జరుగుతోంది. రెండుపార్టీల అధినేతలకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్టు అయినపుడు ఇంకా ముసుగులో గుద్దులాట అవసరమే లేదు. క్యాడర్ పేరుచెప్పి పొత్తేదో అధికారికంగా ప్రకటించేస్తే ఓ పనైపోతుంది కదా.