రజనీ, కమల్ కలిసి పోటీ చేస్తేనా..

రజనీ, కమల్ కలిసి పోటీ చేస్తేనా..

తమిళనాట ఎన్నడూ లేని విధంగా రెండేళ్లుగా ఒక రాజకీయ శూన్యత నెలకొని ఉంది. జయలలిత మరణంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉందన్న మాటే కానీ.. దానికి ఎంతమాత్రం ప్రజామోదం కనిపించడం లేదు. కరుణానిధి మరణంతో డీఎంకే పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో జనాకర్షణ ఉన్న ఫిలిం స్టార్లు దూకుడైన రాజకీయాలు చేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశముంది.

ఐతే ఇటు కమల్ హాసన్, అటు రజనీకాంత్ ఇద్దరూ కూడా రాజకీయారంగేట్రాన్ని ప్రకటించారు కానీ.. ఇద్దరిలో ఎవ్వరూ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. నాలుగు దశాబ్దాలుగా స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ విడివిడిగా పార్టీలు పెట్టి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం జనాలకు మింగుడు పడటం లేదు. వేరుగా పార్టీలు పెట్టారు కాబట్టి ప్రత్యర్థులుగా మారే అవకాశాలూ కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఎవరూ ఎవరి మీదా విమర్శలు చేయలేదు. ముందులాగే సన్నిహితంగా ఉంటున్నారు.

ఇంత స్నేహం ఉన్నపుడు వేర్వేరుగా పోటీ చేసి ఒకరి అవకాశాల్ని మరొకరు దెబ్బ తీసుకోవడం ఎందుకన్న అభిప్రాయాలున్నాయి. ఇద్దరూ కలిస్తే అద్భుతాలు జరుగుతాయన్న అంచనాలున్నాయి. ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ కూడా ఇదే మాట అంటున్నాడు. రజనీ, కమల్ కలిసి పోటీ చేస్తే చరిత్ర సృష్టించడం ఖాయమని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘రజనీ సర్, కమల్ సర్ కలిసి ముందడుగు వేయాలి. అది నడిగర్ సంఘం షో కోసమో... ఏదైనా సినీ వేడుక కోసమో.. లేదంటే మల్టీస్టారర్ సినిమా కోసమో కాదు. 2019 లోక్ సభ ఎన్నికల కోసం వాళ్లు కలవాలి. అప్పుడు కథ మలుపు తిరుగుతుంది’’ అని విశాల్ అన్నాడు.

ఐతే విశాల్ చెబుతున్న లోక్ సభ ఎన్నికలకు రజనీ, కమల్ పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల మాటెలా ఉన్నా.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకైనా వీళ్లిద్దరూ కలవాలని తమిళనాడులో మెజారిటీ జనాలు కోరుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English