టీబీజేపీకి ఇది చివ‌రి అవ‌కాశ‌మా?

టీబీజేపీకి ఇది చివ‌రి అవ‌కాశ‌మా?

తెలంగాణ బీజేపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ముస‌లం పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు బీజేపీ రెండు జాబితాల ద్వారా అభ్యర్థులను ఖరారుచేసిన సంగతి తెలిసిందే. ఇందులో సామాజిక న్యాయం, పార్టీ నేతలకు ప్రాధాన్యం అనే అంశాలను పక్కనపెట్టినట్లు పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తున్నప్పటికీ మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది.

పార్టీ బలోపేతం పేరుతో ఇతర పార్టీల అసంతృప్త నేతలను ఆహ్వానించి తమకు టికెట్లు నిరాకరిస్తారని పలువురిలో సందేహం మొదలైంది. మ‌హాకూట‌మి జాబితా అనంత‌రం వెలువ‌డే అసంతృప్తిని క్యాష్ చేసుకోవ‌డం అనే రూపంలో త‌మ‌కు పార్టీ అన్యాయం చేస్తుందేమేన‌ని ప‌లువురు నేత‌లు రాష్ట్ర కార్యాల‌యంలో త‌మ అభ్య‌ర్థిత్వం ఖ‌రారు కోసం ముందుగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం.

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ విడుదల చేయనున్న మూడో జాబితాపై ఆ పార్టీ నేతల్లో సందేహాలు, భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమవుతున్నాయి  సంప్రదాయ పార్టీలకంటే తాము భిన్నమని ప్రకటిస్తున్న బీజేపీ మొదటి, రెండో జాబితాల్లో జంప్‌జిలానీలకు పెద్దపీట వేసి పార్టీకోసం శ్రమించిన నాయకులకు మొండిచేయి చూపినరీతిలోనే మూడో జాబితా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పలు జిల్లాల అధ్యక్షులకు, ముఖ్యనేతలకే టికెట్లు ఇవ్వని నేపథ్యంలో అనేక సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. కొత్తవారికి టికెట్లు ఇస్తే ఇన్నాళ్లు తాము ఏళ్ల త‌ర‌ప‌డి పడ్డ శ్రమకు గుర్తింపు ఏముంటుందని వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా అధ్యక్షులకే టికె ట్లు దక్కవన్న ప్రచారం నేపథ్యంలో వారు హైదరాబాద్‌ను వీడి జిల్లాల బాట పడుతున్నారు.

ఇదిలాఉండ‌గా...మహాకూటమి ప్రకటించే జాబితాను పరిగణనలోకి తీసుకొని బీజేపీ మూడో జాబితా ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అభ్యర్థుల జాబితాతో కూటమి పార్టీల నేతల్లో అసంతృప్తి ఖాయమని, నిరాశ చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానించి సీట్లు కేటాయించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ చర్య పార్టీలోని ఆశావహులకు ఆందోళన కలిగించే విషయమని పార్టీ నేతలు అంటున్నారు. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి అతి త‌క్కువ స‌మ‌యం ఉందని, ఇంకా నాన్చివేత ఎందుక‌ని ప‌లువురు నేత‌లు పార్టీ తీరును ప్ర‌శ్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English