ఆ మాజీ సీఎం ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ట‌!

ఆ మాజీ సీఎం ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ట‌!

కొన్నిసార్లు అంతే. చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు చెల‌రేగిపోవ‌ట‌మే కాదు.. వ‌ర్తమానం త‌మ‌దే.. భ‌విష్య‌త్తు త‌మ‌దే అన్న‌ట్లు ధీమాగా మాట్లాడ‌తారు. చేతిలో ఉన్న ఆ మేజిక్ చేజారిన త‌ర్వాత మాత్ర‌మే తెలుస్తుంది.. త‌మ అస‌లు బ‌లం ఏమిటో? అందుకే.. కీల‌క స్థానాల్ని చేజిక్కించుకున్న వారంతా.. ఆ స్థానాల్లో ఉన్న‌ప్పుడు త‌మ‌కొచ్చిన అరుదైన అవ‌కాశాన్ని ఎంత‌గా స‌ద్వినియోగం చేసుకుంటారో అంత‌గా రాణిస్తారు.

ఇదంతా ఎందుకంటే.. తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య చేసిన ప్ర‌క‌ట‌న‌ను చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు త‌మ‌కు మించినోళ్లు లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. తాజాగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ పార్టీ ప‌వ‌ర్లోకి వ‌స్తే తాను సీఎం అని ప్ర‌క‌టించుకున్న ఆయ‌న‌.. త‌మ‌కొచ్చిన సీట్ల‌లో స‌గం కూడా రాని పార్టీ ముఖ్య‌నేత‌కు సీఎం ప‌ద‌విని అప్ప‌గించాల్సి రావ‌టం సుతారం ఇష్టం లేదు.

అయినా.. సిద్ద‌రామ‌య్య ఇష్టాయిష్టాల‌తో కాంగ్రెస్ ప‌ని చేయ‌దు క‌దా. ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న మాట‌లు అంత‌కంత‌కూ మారిపోతున్నాయి. తాజాగా ఆయ‌నో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని తేల్చి చెప్పారు. ఎందుకిలా అంటే.. అభివృద్ధి కోసం ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌న్న అద్భుత‌మైన విష‌యాన్ని చెప్పారు.

ఇప్ప‌టికే తాను 13 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేశాన‌ని.. ప్ర‌జ‌ల ఆశీర్వాదాల‌కు త‌గ్గ‌ట్లే తాను ప్ర‌తి ప‌ద‌విని చేప‌ట్టాన‌ని చెప్పారు. ఇక‌పై తాను ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేద‌ని చెప్ప‌టం విశేషం. మొన్న‌టివ‌ర‌కూ తానే త‌ర్వాతి ముఖ్య‌మంత్రి అంటూ ధీమాగా చెప్పిన సిద్ధ‌రామ‌య్య కాలం పుణ్య‌మా అని ఇక పోటీనే చేయ‌న‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. అన్న‌ట్లు.. అభివృద్ధి కోసం పోటీ చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌న్న గొప్ప విష‌యం సిద్ధూకు గ‌తంలో ఎందుకు గుర్తుకు రాన‌ట్లు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English