పట్టు వద్దు....గెలుపు ముద్దు !

పట్టు వద్దు....గెలుపు ముద్దు !

తెలంగాణ రాష‌్ట్ర సమితిని ఓడించాలి. కల్వకుంట్ల చంద్రశేఖ‌ర రావును గద్దె దించాలి. ఆ నలుగురికి గుణపాఠం చెప్పాలి. ఇదీ మహాకూటమిలోని రాజకీయ పక్షాల వాగ్దానాలు. ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితిని  ఓడించేందుకు ఎలాంటి నిర్ణయమైన తీసుకోవాలని, ఎంతటి త్యాగానికైన సిద్దపడాలని మహాకూటమి నాయకులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మహాకూటమిలో సీట్ల సర్దుబాటుతో విబేధాలు వస్తాయని, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది. అయితే మహాకూటమిలో ఎలాంటి విబేధాలు తలెత్తుకుండా అందరూ ఏకతాటిపై ఉండాలని ప్రతిపక్ష నాయకులు నిర్ణయించుకున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలని భావిస్తున్నారు.

నియోజకవర్గాలలో పార్టీతో సంబంధం లేకుండా ఖచ్చితంగా గెలిచే అభ్యర్దినే బరిలో నిలపాలన్నది మహాకూటమి ఉద్దేశంగా తెలుస్తోంది. అంకెల గారడితో కాకుండా వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని పోటి చేయలన్నది మహాకూటమి నిర్ణయంగా తెలుస్తోంది.

మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ 16 స్థానాలలో ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ చేయించిన అంతర్గత సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ 16 స్థానాలను తెలుగుదేశం పార్టీకే వదిలి వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇది కాకుండ మరో మూడు స్థానాలు కూడా కావాలని తెలుగుదేశం పార్టీ కోరుతోంది. దీనిపై అటు తెలుగుదేశం పార్టీ, ఇటు మహాకూటమిలోని ఇతర పక్షాలు పట్టు పట్టకుండా ఉండాలని భావిస్తున్నారు. కేవలం మూడు స్థానాల కోసం స్నేహన్ని వదులుకోరాదని కూటమిలోని అన్ని పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక తెలంగాణ జన సమితికి కూడా వారు ఖచ్చితంగా గెలిచే స్థానాలలో టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తాము అధికారంలోకి వస్తే వివిధ కార్పోరేషన్లతో పాటు అనేక నామినేటడ్ పదవులు ఉంటాయని తెలంగాణ జన సమితి నాయకులకు ఆ పదవులలో ప్రాధాన్యత కల్పిస్తామని మహాకూటమి నాయకులు చెబుతున్నారు. ప్రోఫెసర్ కోదండరామ్ మహాకూటమి కన్వీనర్ పదవిని ఆశిస్తున్నారు. అయితే మహాకూటమిలో పెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని కన్వీనర్ పదవి ఆ పార్టీకే వదిలి వేయాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కంటే కన్వీనర్ పదవి వివాదంగా మారుతోంది.

ఒకటి రెండు రోజులలో ఈ అంశంపై కూడా స్పష‌్టత తీసుకురావాలని భావిస్తున్నారు. కోదండ రామ్‌కు కన్వీనర్ పదవి కాకుండా కో-కన్వీనర్ కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం కాని ఇస్తామని చెప్పి ఒప్పించాలన్నది కాంగ్రెస్ నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలలో ఎలాంటి విబేధాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని మహాకూటమి నాయకులు తీర్మనించుకున్నట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English