కొడుకా.. ‘కోటీ’శ్వర్రావా! ఖర్చయిపోతవురో

కొడుకా.. ‘కోటీ’శ్వర్రావా! ఖర్చయిపోతవురో

ఏపీలో వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బాగా సంపాదించినవారు.. వారసత్వంగా ఉన్న ఆస్తులపై మంచి ఆదాయం పొందుతున్నవారు, ఆర్జనకు అవకాశమున్న ఉద్యోగాల్లో ఉండి రెండు చేతులూ సంపాదించినవారు కోకొల్లలు. ఏసీబీ దాడుల్లో దొరుకుతున్న చిరుద్యోగుల ఆస్తులు కూడా కోట్లలో ఉంటున్నాయి. అయితే... వీరిలో చాలామందికి రాజకీయాలతో సంబంధం లేదు. ఏదో అవసరాలకు ఎవరినో ఒకరిని పట్టుకుని పనులు చేయించుకోవడమే తప్ప రాజకీయ సంబంధాలు లేనివారు చాలామంది ఉన్నారు.

అయితే.. తండ్రులు సంపాదించిన ఆస్తులను చూసుకుంటూ ఖాళీగా తిరిగే వారి సంతానం మాత్రం రాజకీయాలపై తెగ ఆసక్తి చూపిస్తున్నారట. కానీ.. వారికి రాజకీయ నేపథ్యం లేకపోవడం.. అప్పనంగా డబ్బును అనుభవిస్తుండడంతో సీరియస్‌నెస్ లేకపోవడంతో ప్రధానపార్టీలేవీ అలాంటివారిపై ఆసక్తిగా లేవు. కానీ... అభ్యర్థులు దొరక్క నానా పాట్లు పడుతున్న జనసేన మాత్రం డబ్బుంటే చాలు ఎవరికైనా టిక్కెట్టిచ్చేస్తామంటూ ఆఫర్లతో ముందుకొస్తుండడంతో ఇలాంటి బ్యాచంతా జనసేన వైపు చూస్తోంది.

అయితే... కష్టపడో.. కక్కుర్తిపడో కోట్లు సంపాదించిన తల్లిదండ్రులు ఇప్పుడు తమ సుపుత్రులు ఆ డబ్బును ఎక్కడ వృథా చేస్తారో అని భయపడుతున్నారు. రాజకీయాల్లోకి వస్తే ఈ డబ్బంతా ఖర్చయిపోయి మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందని టెన్షన్ పడుతున్నారట. అందులోనూ ఏమాత్రం జనాదరణ కనిపించని పవన్‌ను నమ్ముకుని రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయొద్దని కుమారులకు సూచిస్తున్నారట.

కానీ.. పవన్ పట్ల ఉన్న సినీ క్రేజ్..  ఉన్న ఈ కుర్రకారు మాత్రం తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామంటూ ఇళ్లలో అల్లరి చేస్తున్నారట.

ముఖ్యంగా విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి కుర్రకారు తయారవడంతో తండ్రులు వారిని.. ‘కొడుకా కోటీశ్వర్రావా ఖర్చయిపోతవురో’ అంటూ వారిస్తున్నారట. మరి వారంతా తండ్రుల మాట విని డబ్బు నిలబెట్టుకుంటారో లేదంటే పవన్ మాయలో పడి పోగొట్టుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు