హెచ్4 వీసా ర‌ద్దు...ట్రంప్‌కు వ్య‌తిరేకంగా కొత్త ఆందోళ‌న‌

హెచ్4 వీసా ర‌ద్దు...ట్రంప్‌కు వ్య‌తిరేకంగా కొత్త ఆందోళ‌న‌

అమెరికాలోని అన్ని ఉద్యోగాలు అమెరికన్లకే చెందాలనే నినాదంతో అధికారం చేపట్టిన ట్రంప్‌ ప్రభుత్వం విదేశీయుల‌కు వ‌రుస షాక్‌లు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల అమెరికా సెనేట్‌ హెచ్‌-4 వీసా రద్దుకు సిఫారసు చేసింది. హెచ్‌1బీ ఉద్యోగుల భార్యగాని, భర్తగాని ఉద్యోగం చేసుకునేందుకు ప్రభుత్వం హెచ్‌-4 వీసా మంజూరు చేస్తుంది. ఆ వీసాపై భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానం ఇక్కడ అమల్లో ఉంది. తాజా మాజీ అధ్య‌క్షుడు ఒబామా తీసుకువ‌చ్చిన ఈ నిర్ణ‌యంపై వేటు వేసేందుకు ట్రంప్ సిద్ధ‌మ‌య్యారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్రస్తుతం భారత్‌కు చెందిన హెచ్‌1బీ ఉద్యోగులే అమెరికాలో ఎక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ చైనా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉండేవారు.  అమెరికాలో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉండ‌టం, తాము స్వ‌త‌హాగా నిల‌దొక్కుకోవాల‌నే ఉద్దేశంతో అనేక మంది ఉద్యోగులు త‌మ భాగ‌స్వామ్యుల‌ను కూడా ఉద్యోగం చేయిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 70 వేల మంది హెచ్‌-4 వీసాపై పని చేసేవారున్నారు. ఒక వేళ హెచ్‌-4 వీసా రద్దయితే వారంతా ఖాళీగా ఉండాలి. ఉపాధి కోల్పోతారు.

హెచ్‌-4 వీసాలు పొందిన వారిలో 93 శాతం మహిళ ఉద్యోగులు కాగా  మిగిలిన 7 శాతం పురుషులు. అమెరికాలో హెచ్‌ 4 స్పౌస్‌ వీసాలు పొంది ఉద్యోగం చేస్తున్న వారిలో 93 శాతం మంది భారతీయులేనని అమెరికా సంస్థ సీఆర్‌ఎస్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో 5 శాతం కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియోలో పని చేస్తున్నారు. టెక్సాస్‌, న్యూజెర్సీలో మరో 20 శాతం మంది పని చేస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఇలా భార‌తీయుల‌కు భ‌రోసా ఇచ్చిన ఈ వీసా ర‌ద్దుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వ‌డం క‌ల‌కలం రేకెత్తిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ప‌లువురు అమెరిక‌న్లు భార‌తీయుల కోసం గ‌ళం విప్పుతున్నారు. అమెరికాలో హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములు హెచ్‌ 4 వీసాపై పని అనుమతి పొందే విధానాన్ని తొలగించవద్దని అమెరికాలోని 130 మంది కాంగ్రెస్‌ సభ్యులు ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇండో అమెరికన్‌ శాసన కర్త అయిన ప్రమీలా జైపాల్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఆ పత్రంపై 130 మంది కాంగ్రెస్‌ సభ్యులు సంతకాలు చేశారు. హెచ్‌1బీ వీసాపై పని చేస్తున్న ఉద్యోగుల భాగస్వాములకు పని అనుమతి ఉంచాలని, ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఈ విధానంతో లబ్ది పొందుతున్నారని ప్రమీలా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల అమెరికన్‌ సెక్రటరీ ఆఫ్‌ హౌంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారికి ఈ వినతి పత్రం అందజేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు