దేవెగౌడ‌కు రాహుల్ క్ష‌మాప‌ణ‌లు!

దేవెగౌడ‌కు రాహుల్ క్ష‌మాప‌ణ‌లు!

క‌న్న‌డ రాజ‌కీయాలు జేడీఎస్ చేతిలోకి వెళ్లిపోవ‌డంతో ఇరు పార్టీల ప్రముఖులు...జేడీఎస్ చీఫ్ ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. అందులో భాగంగా, జేడీఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ప్రధాని దేవెగౌడ పుట్టిన రోజు వేడుక‌ను వేదిక‌గా చేసుకున్నాయి. నేడు దేవెగౌడ 85వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఇద్ద‌రు అనూహ్య అతిథుల నుంచి శుభాకాంక్ష‌లు అందాయి. భార‌త ప్ర‌ధాని మోదీ....ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ లు మాజీ ప్ర‌ధానికి ఫోన్ చేసి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక‌, రాహుల్...ఓ అడుగు ముందుకేసి పెద్దాయ‌నకు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్ప‌డం కొస‌మెరుపు.

నేడు దేవెగౌడ 85వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురువారం నాడు తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకొని ఆశీస్సులు అందుకున‌నారు. ఈ నేప‌థ్యంలో దేవెగౌడ‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లని, ఆయ‌న ఆయురారోగ్యాల‌తో క‌ల‌కాలం సంతోషంగా జీవించాల‌ని మోదీ ట్వీట్ చేశారు. తాను దేవెగౌడ‌కు ఫోన్ చేసి మాట్లాడాన‌ని తెలిపారు. మ‌రోప‌క్క రాహుల్...దేవెగౌడ‌కు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు దేవెగౌడకు క్షమాప‌ణ‌లు కూడా చెప్పారు. ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా జేడీఎస్ , దేవెగౌడల పై రాహుల్ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే.

బీజేపీకి జేడీఎస్ బి టీమ్ అని, జనతాదళ్ సంఘ్ పరివార్ అని రాహుల్ ఆరోపించారు. తాజాగా ఇరు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించిన నేప‌థ్యంలో రాహుల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 10 నిమిషాల పాటు రాహుల్, దేవెగౌడ మాట్లాడుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. క‌న్న‌డ‌నాట రాజకీయ పరిణామాలు, ఎటువంటి వ్యూహాలు అనుస‌రించాలి....అని చర్చలు జరిగినట్టు వెల్లడించాయి. స‌మ‌ష్టిగా బీజేపికి వ్య‌తిరేకంగా పోరాడి 2019 ఎన్నికల్లో మోదీని గ‌ద్దె దించేందుకు సహక‌రించాల‌ని దేవెగౌడను రాహుల్ కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా...దేవెగౌడ‌కు రాహుల్, మోదీల ఫోన్ కాల్స్ ఇపుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు