అనిల్ అంబానీ ప‌త‌నం... ఒక పాఠం !

అనిల్ అంబానీ ప‌త‌నం... ఒక పాఠం  !

దేశ వ్యాపార రంగాలు అవాక్క‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇంకా చెప్పాలంటే... బ్యాడ్‌టైం కొన‌సాగితే... వ్యాపార దిగ్గ‌జాలు సైతం త‌మ ప‌రువును తృణ‌ప్రాయంగా వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌నే సందేశం పంపే సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపు బల్లార్డ్ ఎస్టేట్‌లోని తమ కార్పొరేట్ కార్యాలయం రిలయన్స్ సెంటర్‌ను ఖాళీ చేసింది.  ఇకమీదట ఈ గ్రూపు శాంతాక్రజ్‌లోని తమ కార్పొరేట్ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు సాగించనుంది. ఆర్థిక రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు పలు రంగాల్లో వ్యాపారం సాగిస్తున్న రిలయన్స్ గ్రూపు తన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ఆస్తులను అమ్ముతున్న విషయం విదితమే. అందులో భాగ‌మే ఈ మార్పు అని చ‌ర్చ వినిపిస్తోంది.

దాదాపు రూ.60 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ రిలయన్స్ గ్రూపు ముంబైలోని తమ విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ఈ ఏడాది మార్చిలో రూ.18,800 కోట్లకు అదానీ గ్రూపునకు అమ్మింది. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)లో 51 శాతం వాటాను రుణదాతలకు ఆఫర్ చేసిన ఈ గ్రూపు.. తమ ఆధీనంలోని స్పెక్ట్రమ్‌ను అమ్మడం ద్వారా రూ.17 వేల కోట్లు, రియల్ ఎస్టేట్ ఆస్తులను అమ్మడం ద్వారా మరో రూ.10 వేల కోట్లు సమీకరించి మిగిలిన రూ.27 వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించనుంది. మరోవైపు రిలయన్స్ గ్రూపు విద్యుదుత్పత్తి విభాగమైన రిలయన్స్ పవర్ కూడా సమస్యలతో సతమతమవుతోంది. 2008లో ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.11,700 కోట్లు సమీకరించిన రిలయన్స్ పవర్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు తగ్గి రూ.11,400 కోట్లకు పతనమైంది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని శాంతాక్రజ్‌కు తరలించడం జరిగిందని, ఇకమీదట అనిల్ అంబానీ సహా రిలయన్స్ గ్రూపులోని ఉన్నత స్థాయి యాజమాన్యమంతా అక్కడి నుంచే పనిచేస్తారని ఆ గ్రూపునకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు.

ఇప్పటివరకూ బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న రిలయన్స్ గ్రూపు ప్రధాన కార్యాలయాన్ని గత కొన్నేళ్ల‌ నుంచి బోర్డు సమావేశాలు, మీడియా సమావేశాల్లాంటి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. రిలయన్స్ సెంటర్‌లోని మూడంతస్తుల్లో గల 6 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఇకముందు కూడా తమ ఆధీనంలోనే ఉంటుందని రిలయన్స్ గ్రూపు అధికారులు చెప్పారు. అయితే ఈ ఆఫీస్ స్పేస్‌తో రిలయన్స్ గ్రూపు ఏమి చేయాలనుకుంటున్నదో వారు వెల్లడించలేదు. దీనిని గనుక రిలయన్స్ గ్రూపు అద్దెకు ఇస్తే నెలకు సుమారు రూ.10 లక్షల చొప్పున రాబడి వస్తుందని ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. గత పదేళ్ల‌లో హిందుస్థాన్ యూనీలీవర్, మెర్సెక్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పలు సంస్థలు దక్షిణ ముంబై నుంచి తమ ప్రధాన కార్యాలయాలను ముంబై శివారు ప్రాంతాలకు తరలించాయి.
ముంబై పోర్టు ట్రస్టు స్థలంలో నిర్మితమైన రిలయన్స్ సెంటర్ (గతంలో దీని పేరు క్రిసెంట్ హౌస్) భవనం కోల్‌కతాకు చెందిన ఐసీఐ సంస్థ ఆధీనంలో ఉండేది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థల విభజనకు ముందు ఆ గ్రూపు 90వ దశకం ఆరంభంలో ఐసీఐకి చెందిన కొన్ని వ్యాపారాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ భవనం రిలయన్స్ ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత రిలయన్స్ గ్రూపుతో వివాదం తలెత్తడంతో మహారాష్ట్ర పౌర సరఫరాల విభాగం ఆ భవనంలోని 3వ అంతస్తును ఆక్రమించింది. అయితే మరమ్మతులు, ఆధునీకరణ పనుల పేరుతో 1997 జనవరిలో ఆ అంతస్తును ఖాళీ చేయించిన రిలయన్స్.. 2002లో ఆ పనులు పూర్తయిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల విభాగాన్ని మళ్లీ ఆ అంతస్తులో అడుగు పెట్టనీయలేదు. ఈ విషయమై ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగగా.. సుప్రీం కోర్టు గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే...ఇంత‌టి కీల‌క‌మైన స్థ‌లం అనిల్ ఖాళీ చేయ‌డం ఆ సంస్థ స్థితికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English