ఏపీకి రాను...పుదుచ్చేరిలోనే ఉంటా: కిరణ్ బేడీ

ఏపీకి రాను...పుదుచ్చేరిలోనే ఉంటా: కిరణ్ బేడీ

కొద్ది రోజులుగా ఏపీలో ప్ర‌త్యేక హోదాపై కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌పూరిత వాతావ‌ర‌ణం, మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డం...వంటి ప‌రిణామాల నేపథ్యంలో ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించాల‌ని మోదీ స‌ర్కార్ స‌న్నాహాలు చేస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇరు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ ప‌ద‌వీకాలం కూడా ముగియ‌నుండ‌డంతో...ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వ‌ర్తిస్తోన్న కిరణ్ బేడీని ఏపీకి నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని పుకార్లు వ‌చ్చాయి. తాజాగా, ఆ పుకార్ల‌ను ఖండిస్తూ కిర‌ణ్ బేడీ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఏపీ గవర్నర్ గా రాబోతున్నార‌న్న వార్త‌లను ఆమె ఖండించారు.

తాను ఏపీకి గవర్నర్ గా వెళ్లబోతున్నట్లు జ‌రుగుతోన్న‌ ప్రచారం వాస్త‌వం కాదని, అవి కేవ‌లం నిరాధారమైన పుకార్లేన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.  ప్రస్తుతం తాను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా విధులు నిర్వ‌హించ‌డం సంతృప్తిక‌రంగా ఉంద‌ని, అక్క‌డ తాను చేపట్టిన కార్యక్రమాలతో మంచి పేరు వస్తోందని అన్నారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ గా పూర్తికాలం పుదుచ్చేరిలోనే కొనసాగుతానని కిర‌ణ్ బేడీ అన్నారు. అంతేకాదు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కే  కాకుండా మ‌రే రాష్ట్రానికీ గవర్నర్ గా వెళ్లబోనని తేల్చి చెప్పేశారు.

కాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామికి, కిర‌ణ్ బేడీకి విభేదాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో కిరణ్ బేడీ జోక్యంపై స్వామి అసంతృప్తి వ్య‌క్తం చేసినట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా కిర‌ణ్ బేడీ రాబోతున్నార‌న్న పుకార్ల‌కు బ‌లం చేకూరింది. అయితే, కిర‌ణ్ బేడీ స్వ‌యంగా వాటిని ఖండించ‌డంతో ఆ పుకార్ల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు