ట్రంప్ కుమారుడికి భార్య‌ విడాకులు!

ట్రంప్ కుమారుడికి భార్య‌ విడాకులు!

త‌న భార్య మెలానియా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల‌ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని, అందుకే వారిద్ద‌రూ అంటీముట్ట‌నట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌లో కూడా ట్రంప్ కు మెలానియా దూరంగా ఉంటున్నార‌ని అంత‌ర్జాతీయ మీడియా కూడా కోడై కూసింది. అయితే, కొద్ది రోజుల క్రితం ట్రంప్ దంప‌తులు జంట‌గా ఓ ఈవెంట్ లో క‌నిపించ‌డంతో ఆ పుకార్ల‌కు తెర‌ప‌డింది. మ‌రోప‌క్క ట్రంప్ , రష్యాల‌ మధ్య ఉన్న సంబంధాలపై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది.

ట్రంప్ తో ఓ పోర్న్‌స్టార్ కు సంబంధాలున్నాయ‌ని వార్త‌లు రావ‌డం, సెటిల్మెంట్ , తాజాగా ఆమె ట్రంప్ గుట్టు విప్పుతాన‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితుల మ‌ధ్య స‌త‌మ‌త‌మ‌వుతోన్న ట్రంప్ నకు తాజాగా మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, కోడలు వెనెస్సా హెడెన్ ట్రంప్ లు  విడాకులు తీసుబోతున్నా వార్త ట్రంప్ ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

డొనాల్డ్ ట్రంప్ జూనియర్, మోడల్ వెనెస్సా హెడెన్ ల వివాహం 2005లో జ‌రిగింది. వీరికి ఐదుగురు పిల్లలు. జూనియ‌ర్ ట్రంప్ అమెరికా టెలివిజన్ రంగంలో పేరు మోసిన బిజినెస్ మేన్. ట్రంప్ అధ్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే ముందు ఆయ‌న వ్యాపార సామ్రాజ్యాన్ని జూనియ‌ర్, అత‌డి త‌మ్ముడు ఎరిక్ ల‌కు అప్ప‌గించారు. అయితే, అధ్య‌క్ష ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత కుటుంబం కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయించాల‌ని జూనియ‌ర్ ను వెనెస్సా కోరింది. కానీ, జూనియ‌ర్ వ్యాపార వ్య‌వ‌హారాల్లో ప‌డి అసలు కుటుంబానికి సమయం కేటాయించడం లేదని ఆమె ఆరోపించారు.

తామిద్ద‌రం క‌లిసి గ‌డిపేందుకు స‌మ‌యం దొర‌క‌డం లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే గురువారం నాడు మన్ హట్టన్ లోని సుప్రీం కోర్టులో త‌క్ష‌ణ‌మే విడాకులు కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తమకు ఐదుగురు పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌, ఆస్తుల పంప‌కాల వ్య‌వ‌హారాన్ని సానుకూలంగా పరిష్క‌రించుకుంటామ‌ని, అంత‌కు ముందే తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె పిటిష‌న్ లో కోరారు. విడిపోయినప్ప‌టికీ త‌మ‌కు ఒక‌రిపై ఒక‌రికి గౌర‌వ‌ముంద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు