ఆ ఛానెల్ మీద వర్మ క్రిమినల్ కేసు

ఆ ఛానెల్ మీద వర్మ క్రిమినల్ కేసు

ఎప్పుడూ రామ్ గోపాల్ వర్మ మీద వాళ్లూ వీళ్లూ కేసులు పెట్టడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడమే చూస్తుంటాం. ఐతే ఇప్పుడు వర్మ ఒక టీవీ ఛానెల్ మీద కేసు పెట్టడానికి సిద్ధమవుతుండటం విశేషం. తన మీద అభ్యంతరకర కథనాలు ప్రసారం చేస్తున్న ఒక న్యూస్ ఛానెల్ మీద తాను పలు కేసులు పెట్టబోతున్నట్లు వర్మ వెల్లడించాడు.

ఇందులో క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసుల కోసం తన లాయర్లు అవసరమైన సమాచారం సేకరించే పనిలో ఉన్నట్లుగా వర్మ వెల్లడించాడు. కొన్ని రోజుల కిందట వర్మ తన సినిమా ‘జీఎస్టీ’ ప్రచారం కోసం చాలా ఛానెళ్లను ప్రచార సాధనాలుగా ఉపయోగించుకున్నాడు. ఆ ఛానెళ్లలో కూర్చునే మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ కేసులు కొని తెచ్చుకున్నాడు.

వర్మ కేసు పెడతానని అంటున్న టీవీ ఛానెల్ మీద నిన్నట్నుంచే వర్మ విమర్శలు గుప్పిస్తున్నాడు. తాను ముంబయిలోని ఒక అపార్ట్ మెంట్ 27వ ఫ్లోర్లో కూర్చుని చిల్ అవుతూ ఆ టీవీ ఛానెల్లో వచ్చే నాన్సెన్సికల్ న్యూస్ రిపోర్ట్స్ చూస్తూ నవ్వుకుంటున్నానని.. ఆ ఛానెల్ పేరును కూడా మార్చాలని ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు వర్మ. నిన్న సరదాగా స్పందిస్తున్నాడనుకుంటే ఈ రోజు ఏకంగా కేసులు అంటున్నాడు.

ఈ ఛానెల్ తో పాటు బీజేపీ నాయకురాలు తుమ్మలపల్లి పద్మ మీద కూడా తాను కేసు పెట్టబోతున్నానని చెప్పిన వర్మ.. ఆమె తన మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తోందో చూడండంటూ ఒక వీడియో షేర్ చేశాడు. అందులో వర్మను ఎన్ కౌంటర్ చేసేయాలంటూ పద్మ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని కేసులు పెడుతున్నపుడు.. తాను రివర్సులో ఎందుకు అందరి మీదా కేసులు పెట్టకూడదని వర్మ ఇలా టర్న్ తీసుకున్నాడేమో అనిపిస్తోంది చూస్తుంటే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు