చంద్రబాబు కంటే స్పీడుగా ఉన్న బీజేపీ

చంద్రబాబు కంటే స్పీడుగా ఉన్న బీజేపీ

రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు గత ఎన్నికల్లో అటూఇటూగా ఉన్న గెలుపు అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించడం, ఆ తరువాత విపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం మరింత పెంచుకోవడం తెలిసిందే. దాంతో రాజకీయాల్లో ఇసుక నుంచి తైలం తీసే నేతగా చంద్రబాబు మరోసారి గుర్తింపు పొందారు.

ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు కేంద్రంతో నడుస్తున్న ముసుగు రాజకీయంలో చంద్రబాబు కచ్చితంగా ఏదో ఒక భారీ స్కెచ్‌తో ఉన్నారన్న అంచనాలు చాలామందిలో ఉన్నాయి. కానీ.. తాజా పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబును మించిపోయేలా బీజేపీ స్కెచ్ వేస్తోందని.. ఏపీ బీజేపీ ప్లాన్లు చంద్రబాబు కంటే చురుగ్గా ఉన్నాయని తాజా పరిణామాలు చెప్తున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న తమ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించే దిశగా బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్రం లో, అసెంబ్లీలో ఇక అసలుసిసలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆ పార్టీ రెడీ అవుతోంది. దాంతో అధ్యక్షుడి అభిప్రాయాలు, నిర్ణయాలతో సంబంధం లేకుండానే ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నట్లు ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో స్పష్టమైంది.

టీడీపీ తమపై చేస్తున్న దుష్ప్రచారంపై ఎదురుదాడి చేయాల్సిందేనని తీర్మానించారు.  అంతేకాదు... చంద్రబాబు  మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేసి బయటకొచ్చి పార్టీని బతికించుకుందామన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సూచన చేయగా... మెజారిటీ నేతలు ఏకీభవించారు. నిజానికి పార్టీలోకి కొద్దిమంది కీలక నేతలే ఆ ప్లాను వేశారని.. దాన్ని విష్ణువర్ధన్ రెడ్డితో ప్రతిపాదించారని తెలుస్తోంది.

విష్ణు ప్రతిపాదన తరువాత మంత్రి మాణిక్యాలరావు వెంటనే స్పందిస్తూ తాను రాజీనామాకు సిద్ధమని చెప్పారు.  ‘నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే రాజీనామా చేయడం నిమిషాల పని. అసలు మీ పార్టీని టీడీపీ వాళ్లు రోజూ తిడుతుంటే మీరెందుకు రాజీనామాలు చేసి బయటకు రావడం లేదని నాకు మనవాళ్లు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు. అందుకే నేను ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాల్సి వస్తోంది. నాకూ ఈ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు