కేటీఆర్ పంచ్‌కు రేవంత్ బ‌దులు అదిరిందిగా!

కేటీఆర్ పంచ్‌కు రేవంత్ బ‌దులు అదిరిందిగా!

తండ్రి తీరులో కాకున్నా.. ఆయ‌న స‌మ‌ర్థ‌త స్థాయిలో ఏ మాత్రం తీసిపోడ‌న్న పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు ఆయ‌న కుమారుడు క‌మ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. రెండు రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి.. వారి సందేహాల‌కు స‌మాధానాలు ఇచ్చి తానేంటో మ‌రోసారి నిరూపించుకున్నారు కేటీఆర్‌. ఈ సంద‌ర్భంగా ఒక నెటిజ‌న్ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి మీద స్పందించాల‌ని కోరారు.

దీనికి వెంట‌నే బదులిచ్చిన కేటీఆర్‌.. ఆయ‌న ఎవ‌రు? అంటూ ప్ర‌శ్నించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. జ‌స్ట్ ఇగ్నోర్ అన్న‌ట్లుగా కేటీఆర్ తీరు ఉండ‌టం క‌నిపించింది. రేవంత్ గురించి మాట్లాడి ఆయ‌న్ను పెద్దోడ్ని చేయ‌న్న‌ట్లుగా కేటీఆర్ తీరు ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇదిలా ఉంటే.. కేటీఆర్ ఇచ్చిన పంచ్‌కు అంతే ధీటుగా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఆ మ‌ధ్య‌నే చేరిన తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మిడ్జిల్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. త‌న‌ను గుర్తుకు ప‌ట్ట‌క‌పోయినా ఫ‌ర్లేద‌ని.. తెలంగాణ కోసం ఆత్మ‌బ‌లిదానం చేసిన శ్రీ‌కాంతాచారి ఎవ‌రు అని అడిగే ప్ర‌మాదం ఉందంటూ భారీ రిటార్ట్ ఇచ్చేశారు.

ఆచార్య కోదండ‌రామ్‌ను.. కానిస్టేబుల్ కిష్ణ‌య్య‌ను.. క‌వితానాయ‌క్‌ను.. వేణుగోపాల్ రెడ్డిని ఎవ‌రూ అని కేటీఆర్ అడుగుతార‌న్న ఆయ‌న‌.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌లేద‌న్న‌ప్పుడు కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో 10 జ‌న్ ప‌థ్ కు వెళ్లి సోనియాగాంధీ కాళ్లు ప‌ట్టుకొని ఎందుకు కృతజ్ఞతలు తెలిపారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున యుద్ధం చేయ‌టానికే తాను కాంగ్రెస్ లో చేరిన‌ట్లు చెప్పిన రేవంత్‌.. కేసీఆర్ ను ఎంపీగా గెలిపించి రాజ‌కీయ భిక్ష పెట్టింది పాల‌మూరు ప్ర‌జ‌లేన‌న్నారు. అలాంటి కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఆ ప్రాంత స‌మ‌స్య‌ల‌లు క‌నిపించ‌టం లేద‌న్నారు.

జ‌డ్చ‌ర్ల జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌లో మంత్రి ల‌క్ష్మారెడ్డిని తాన‌ను త‌క్కువ చేసిన‌ట్లు మాట్లాడ‌లేద‌ని.. కేవ‌లం ల‌క్ష్మారెడ్డి చ‌దువు గురించి మాత్ర‌మే మాట్లాడాన‌న్నారు. 2004 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ల‌క్ష్మారెడ్డి తాను 1988లో డాక్ట‌ర్ కోర్సు పూర్తి చేసిన‌ట్లు స‌మ‌ర్పంచార‌ని.. త‌ర్వాత ఎన్నిక‌ల్లో 1987లో అదే కోర్సు పూర్తి చేసిన్ట‌లు పేర్కొన్నార‌ని.. క‌ర్ణాట‌క‌లో ఆయ‌న చ‌దివిన క‌ళాశాల‌కు 1985లో గుర్తింపు వ‌చ్చింద‌ని..ఆయ‌న చెప్పిన కోర్సు పూర్తి చేయ‌టానికి ఐదున్న‌రేళ్లు ప‌డుతుంద‌ని.. మ‌రి అలాంట‌ప్పుడు రెండేళ్ల‌లో డాక్ట‌ర్ కోర్సు ఎలా పూర్తి చేశారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. ఎలాంటి తిట్టు తిట్ట‌కుండా సూటిగా అడుతున్న సందేహాల‌కు మంత్రి ల‌క్ష్మారెడ్డి ఎలాంటి స‌మాధానాలు ఇస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు