మోదీని హెచ్చరించినందుకు బాబుపై కాంగ్రెస్, వైసీపీ నేతల సీరియస్

మోదీని హెచ్చరించినందుకు బాబుపై కాంగ్రెస్, వైసీపీ నేతల సీరియస్

పోలవరం విషయంలో కేంద్రం అభ్యంతరాలు చెప్తోందని... ఇలా అయితే, ప్రాజెక్టు నిర్మాణం ఆపేస్తామంటూ మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అయితే... బీజేపీ ప్రభుత్వంపై మిత్రపక్ష అధినేతగా, ఏపీసీఎంగా చంద్రబాబు అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తే బీజేపీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదు. చివరకు... నిత్యం చంద్రబాబుపై ఇంతెత్తున లేచే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఎంతో సుతిమెత్తగా ‘చంద్రబాబు అలా ఎందుకన్నారో తెలియదు’ అని ఆశ్చర్యం వ్యక్తంచేశారంతే. కానీ... ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఏపీలో విపక్ష వైసీపీ నేతలు కూడా చంద్రబాబుపై మండిపడుతున్నారు. దీంతో బీజేపీ చేతికి మట్టి అంటకుండానే చంద్రబాబుపై కావాల్సినంత బురద పడుతోంది.

    పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏమీ స్పందించకపోయినా కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఫైరవుతున్నారు. ఆ పార్టీ ఎంపీ కేవీపీ చంద్రబాబును దుయ్యబట్టారు. పలువురు ఇతర నేతలూ చంద్రబాబును ఉతికి ఆరేశారు. అంతేకాదు.. గతంలో కాంగ్రెస్‌లో ఉండి ఇప్పుడు వైసీపీలో ఉన్నవారు, ఏ పార్టీలోనూ లేకుండా ఖాళీగా ఉన్న కాంగ్రెస్ మాజీలు కూడా చంద్రబాబును ఈ విషయంలో ఏకిపడేస్తున్నారు.

    మాజీ మంత్రి బొత్స అయితే.. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రం భావించిందని.. పోలవరం అనుకున్న సమయానికి పూర్తి కాదని, దీనికి చంద్రబాబే కారణమన్నారు. కనీసం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి కూడా ఈ విషయంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నిధులపై నిర్వేదం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పుడు మెతకగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటని ఆయన అడిగారు.  చంద్రబాబు వీక్ నెస్ పాయింట్ ఏదో కేంద్రం వద్ద ఉన్నట్టు అనిపిస్తోందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు