హైకోర్టుకు వెళ్లడమే జగన్ కు శాపమా?

హైకోర్టుకు వెళ్లడమే జగన్ కు శాపమా?

వైఎస్ జగన్మోహనరెడ్డి కేబినెట్ హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయితే కావొచ్చు. అయితే తాను ప్రజల వద్దకు వెళ్లాలని కోరుకున్నా కూడా ఆయనకు అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. ఆయనకు కోర్టు అనుమతులు అవసరం అవువతాయి. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకునే అవకాశం లేదు. విచారణ సాగుతోంది. ఇవన్నీ గమనించుకుంటూనే ఆయన మిగిలినవి ప్లాన్ చేసుకోవాలి. అయితే అనుమతులు విషయంలో ఆయన సరైన వ్యూహం అంటూ లేకుండా తీసుకున్న ఒక దుందుడుకు నిర్ణయం ఇప్పుడు ప్రధానంగా అడ్డం పడుతోందని పలువురు అనుకుంటున్నారు. అదేంటంటే.. పాదయాత్ర సమయంలో తాను కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన ముందుగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం. ముందుగా హైకోర్టుకు వెళ్లిన నేపథ్యం.. ఇప్పుడు సీబీఐ కోర్టు కూడా తిరస్కరించడానికి కారణంగా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

నిజానికి జగన్మోహనరెడ్డికి సంబంధించిన అవినీతి ఆర్థిక అక్రమాల కేసులు అన్నీ సీబీఐ కోర్టులోనే విచారణ సాగుతున్నాయి. ఈ కేసులకు సంబంధించి.. ఎలాంటి మినహాయింపులు, వెసులుబాటులు కోరుకున్నా సరే.. జగన్ ఇదే కోర్టును ఆశ్రయిస్తే సరిపోయేది. అయితే.. ఇంతకంటె పైనుంచి వారికి ఆదేశాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కాస్తా బ్యాక్ ఫైర్ అయింది. ఇప్పుడు తిరిగి కింది కోర్టునే అంటే సీబీఐ కోర్టునే ఆశ్రయించాల్సి వచ్చింది. తీరా ఇక్కడ గతంలో హైకోర్టు ఇదే విజ్ఞప్తిని తిరస్కరించిందనే అంశం ప్రధానంగా వాదనల్లో భాగం అవుతోంది. ఆ కారణాలు చూపి జగన్ వినతిని న్యాయస్థానం తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు అంటున్నారు.

కౌంటర్ వేసిన సీబీఐ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసిన తర్వాత.. సెక్షన్లు మార్చి అదే వినతిని కిందికోర్టులో పిటిషన్ ద్వారా వేయడమే కరక్టు కాదని సీబీఐ వాదిస్తోంది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలే తప్ప.. సెక్షన్లు మార్చి కింది కోర్టుకు రావడం సరికాదనే వాదన పెరుగుతోంది. ఈ వాదన గనుక నిలబడితే.. జగన్ కు అనుమతి రాకపోవచ్చు. ఆయన సీబీఐ కోర్టును పట్టించుకోకుండా, దుడుకు గా ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేసి అనుమతి కోరడమే ఆయనకు శాపంగా మారుతుందని అంతా భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు