బీజేపీని మ‌ళ్లీ టార్గెట్ చేసిన జ‌న‌సేనాని

బీజేపీని మ‌ళ్లీ టార్గెట్ చేసిన జ‌న‌సేనాని

గ‌త ఎన్నిక‌ల నాటి మిత్ర‌ప‌క్ష‌మైన (!) భార‌తీయ జ‌న‌తాపార్టీపై జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు నిప్పులు చెరిగారు. ఇటీవ‌లి కాలంలో బీజేపీ ల‌క్ష్యంగా ప‌లు అంశాల‌పై స్పందిస్తున్న జ‌న‌సేనాని తాజాగా మ‌రో కీల‌క అంశంపై కేంద్రం తీరును తీవ్రంగా తప్పుప‌ట్టారు. విశాఖలో 40 ఏళ్లుగా లాభాల బాటలో పయనిస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసిన నేపథ్యంలో అందులో విధులు నిర్వహిస్తున్న సుమారు 1,600 మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కళ్యాణ్‌ ను కలిసి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు-ఇప్పటి వరకు ఆర్జించిన లాభాలు-ప్రైవేటీకరణ ప్రతిపాదన లకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరించారు. లాభాల బాటలో ఉన్న తమ పరిశ్రమను కేంద్రం ఎందుకు ప్రయివేటీకరణ చేయాలని భావిస్తుందో తెలియక తాము ఆందోళన చెందుతున్నామన్నారు.

వారి అభిప్రాయాల‌ను సానుకూలంగా విన్న జ‌న‌సేనాని ఈ సంద‌ర్భంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుపై మండిప‌డ్డారు. ఇందులో ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సేతుసముద్రం కట్‌చేసి, అక్కడ నౌకల కోసం మరో ప్రాజెక్టు సంకల్పించిందని ఇది డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు కేటాయించిందని, కానీ ఆ తరువాత ప్రభుత్వం మారిపోయిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు నిలిచిపోయిందని ప‌వ‌న్ చెప్పారు. ఇలా ప్రభుత్వాలు మారిన ప్రతీసారి తీసుకున్న నిర్ణయాలు గందరగోళంగా మారుతున్నాయన్నారు. విభజన నేపథ్యంలో మూడు పరిశ్రమలను కట్టబెట్టి ఉద్యోగులకు ఏం సమాధానం చెబుతా రంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లో డ్రెడ్జింగ్‌ కార్పొ రేషన్‌ను ప్రైవేటీకరణ చేయాల్సి వస్తే అందులో మెజారిటీ వాటా ప్రైవేట్‌ వ్యక్తులకు చెందకుండా ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. టీచర్లు, ప్రొఫెసర్లుతో పాటు ఇలా అనేక విభాగాల్లో సమస్యలు నెలకొంటున్నాయని కాబట్టి వీటిపై రాష్ట్రం పూర్తి స్థాయిలో దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఇది భారతీయ జనతాపార్టీ, తెలుగు దేశం ప్రభుత్వాలే కాదని ఏ ప్రభుత్వమైనా ఇటువంటి విధానాలు విడనాడాలన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో బీజేపీ ఏపీలో ప్రజల నమ్మకం పొందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తక్షణమే డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ అంశాన్ని పున:పరిశీలించి కార్మిక వర్గాలకు న్యాయం చేయాలని కోరారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించలేదని అదే స‌మ‌యంలో దానిపై ఎటువంటి స్పష్టత కేంద్రం ఇవ్వడం లేదని ప‌వ‌న్ పేర్కొన్నారు. మ‌రోవైపు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్రజలకు కడుపు మండి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొన్నదని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో కేంద్ర మంత్రి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టంగా చెప్పారని, ఆ తరువాత ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇటువంటి సంస్థలకు చైనాతోపాటు అనేక దేశాలు అండగా ఉంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోకి రాదని భావిస్తున్నట్లుందని, కానీ ఉద్యోగ వర్గాలు ఈ రాష్ట్రానికి చెందిన వారే అనే విషయాన్ని గుర్తించుకొని అండగా నిలబడాలని కోరారు. అక్టోబర్‌, నవంబర్‌లో తాను విశాఖ వెళ్లి అక్కడ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను పరిశీలన జరుపుతామన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు