జీఎస్టీ మీద సందేహ‌మా? సొల్యూష‌న్ ఇదిగో!

జీఎస్టీ మీద సందేహ‌మా? సొల్యూష‌న్ ఇదిగో!

మ‌హా అయితే వారం రోజులు. ఇంకా క‌చ్ఛితంగా చెప్పాలంటే ఈ నెల 30వ తేదీ అర్థ‌రాత్రి నుంచి అమ‌లు కానున్న వ‌స్తు..సేవ‌ల ప‌న్ను పొట్టిగా జీఎస్టీకి సంబంధించి బోలెడ‌న్ని సందేహాలు వ‌స్తున్నాయి. మ‌రి.. వీటికి సొల్యూష‌న్ ఇచ్చే వారు క‌నిపించ‌క చాలామంది క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలాంటి వేళ‌.. జీఎస్టీ సందేహాల ప‌రిష్కారం కోసం కొత్త ఏర్పాటును  చేసింది కేంద్రం.

ఒకే దేశం.. ఒకే ప‌న్ను.. ఒకే మార్కెట్ నినాదంతో రానున్న కొత్త వ‌స్తు.. సేవ‌ల ప‌న్ను విధానానికి సంబంధించి సందేహాల నివృతి కోసం రెండు కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాల్ సెంట‌ర్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ కంపెనీల ధ‌ర ప‌ట్టిక‌లు.. మొత్తం వ్యాపార వివ‌రాల్ని ఈ కాల్ సెంట‌ర్ స‌మ‌న్వ‌యం చేయ‌నుంది. జీఎస్టీ అమ‌లులో ఇది కీల‌క‌భూమిక పోషించ‌నుంది.

వ్యాపార కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేలా ప్ర‌ముఖ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్‌.. టెక్ మ‌హీంద్రాల భాగ‌స్వామ్యంతో ఈ కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. జీఎస్టీ ప‌న్ను చెల్లింపుదారుల సందేహాలు ఏవైనా స‌రే 0120-48889999 నెంబ‌రుకు కాల్ చేసి సందేహాలు తీర్చుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

కొత్త సాంకేతిక‌ను అర్థం చేసుకునే విష‌యంలో ప‌న్ను చెల్లింపుదారులంతా నిష్ణాతులు కాక‌పోవ‌చ్చ‌ని అందుకే అలాంటి వారికి సాయంగా నిలిచేందుకు కాల్ సెంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రోవైపు సెంట్ర‌ల్ సేల్స్ ట్యాక్స్ శాఖ సైతం ఒక హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. వీరు ఏర్పాటు చేసిన కాల్ సెంట‌ర్ నెంబ‌రు 0124-4479900. జీఎస్టీకి సంబంధించిన సందేహాల్ని ఈ నెంబ‌రుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు